రాజకీయ లబ్ధి కోసమే నాపై తప్పుడు ఆరోపణలు

రాజకీయ లబ్ధి కోసమే నాపై తప్పుడు ఆరోపణలు
. సంక్షేమ ప్రభుత్వాన్ని ఆదరించండి…
. ఆశీర్వదించి ఒక అవకాశం కల్పించండి
. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్:
ఓటమి భయంతో రాజకీయ లబ్ధి పొందేందుకు తనపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. మంగళవారం నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో పలు గ్రామాల్లో బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషిచేసిన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించి తనను ఆశీర్వదించి ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పించాలని కోరారు. ప్రజా సంక్షేమం కోసం కృషిచేసిన సీఎం కేసీఆర్, బిఆర్ఎస్ వెంటే నియోజకవర్గ ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న నాయకులు దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. ప్రతిపక్ష నాయకులు సృష్టిస్తున్న అపోహలను ప్రజలు ఎవరు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

ఏడుసార్లు అవకాశం ఇస్తే ఈటల చేసింది ఏమీ లేదు…
గత 20 ఏళ్లుగా ఈటల రాజేందర్ ను ఏడుసార్లు గెలిపిస్తే నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. ఉప ఎన్నికల కష్టకాలంలో కూడా గెలిపిస్తే కనీసం రెండున్నర సంవత్సరాలుగా ఒక్కసారి కూడా నియోజవర్గానికి రాకపోవడం బాధాకరమన్నారు. బిజెపి, కాంగ్రెస్ మాయమాటలతో ప్రజలు నమ్మి మోసపోవద్దన్నారు. బీసీ ముఖ్యమంత్రి పేరుతో బిజెపి బీసీలను మోసం చేసేందుకు కుట్రలు చేస్తుదన్నారు. దేశంలో బీసీలకు తీవ్ర అన్యాయం చేసింది బిజెపి పార్టీ అని ఆరోపించారు. నాకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఐదు సంవత్సరాల్లో హుజురాబాద్ ను సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. గత 15 సంవత్సరాలుగా మీకోసమే సేవ చేస్తున్నానని, ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించి మరింత సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలంటూ వేడుకున్నారు. మూడోసారి కూడా తెలంగాణలో గులాబీ జెండా ఎగరబోతుందని అన్నారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని అన్నారు. కానిపర్తి గ్రామంలో కూడా గెలిచిన రెండు నెలల్లోపు పోచమ్మ గుడి అద్భుతంగా నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అలాగే మిగిలిపోయిన రోడ్లు, భవనాలు, కాలువలు ఏమీ ఉన్నా పూర్తి చేస్తానన్నారు.

హామీలని నెరవేర్చేలా చూస్తా కౌశిక్ రెడ్డి సతీమణి షాలిని…
గత 15 సంవత్సరాల నుంచి రాజకీయంగా ఉన్నప్పటికీ మా కుటుంబమంతా మీ వెంటే ఉన్నామని కౌశిక్ రెడ్డి సతీమణి షాలిని అన్నారు. కౌశిక్ రెడ్డి గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా తన వెన్నంటే ఉంటానని తెలిపారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అని, ఈ ప్రాంతంలో వేరే అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉంటే అభివృద్ధి జరగదన్నారు. అనంతరం ప్రతి మహిళకు బొట్టుపెట్టి ఓటు వేయాలని అభ్యర్థించారు.

కమలాపూర్ లో బిజెపి షాక్…బిఆర్ఎస్ లో భారీ చేరికలు..
కమలాపూర్ మండలంలో బిజెపికి భారీ షాక్ తగిలింది. బిజెపి నుంచి సీనియర్ నాయకులు మంగళవారం బిఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దేశరాజు పల్లి గ్రామంలోని బిజెపి గ్రామ శాఖ అధ్యక్షుడు ఎండి పాషా, కార్యదర్శి ఒగ్గోజు సదయ్య, బూతు అధ్యక్షుడు కృష్ణ, లతోపాటు కొంతమంది నాయకులు బిఆర్ఎస్ లో చేరారు. హుజురాబాద్ అభివృద్ధి జరగాలంటే కౌశిక్ రెడ్డి తోనే సాధ్యమని బిఆర్ఎస్ లో చేరినట్లు తెలిపారు.