ఉత్కంఠ…
. గెలుపు ఓటములపై జోరుగా చర్చ
. పోలింగ్ సరళి పై ఆరా తీస్తున్న అభ్యర్థులు
. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు

కరీంనగర్:
జిల్లాలో ఎన్నికల ప్రధాన ఘట్టమైన పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో ఇక అందరి ఆలోచనలు ఫలితాలపైనే కేంద్రీకృతమయ్యాయి. జిల్లాలో నాలుగు శాసనసభ నియోజకవర్గాల ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రా (ఈవీఎం)ల్లో నిక్షిప్తమైంది. కాగా పోరు ముగిసినప్పటికీ అభ్యర్థుల్లో ఉత్కంఠ మాత్రం వీడలేదు. ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందోనన్న ఆందోళన కనిపిస్తుంది. అనుచరుల ద్వారా నియోజకవర్గంలో నమోదైన పోలింగ్ సరళి పై ఆరా తీస్తున్నారు. మొదటినుంచి అనుకున్న విధంగా కాకుండా పోలింగ్ ఒకరోజు ముందు నుంచి ఓటర్ల నాడి మారిపోవడంతో గెలుపోటముల అంచనాలు తలకిందులు అవుతున్నాయి. మారిన రాజకీయ పరిస్థితులపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతుంది. శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో గెలుపు ఓటములపై జిల్లాలో చర్చ మొదలైంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు స్ట్రాంగ్ రూములలో భద్రపరచగా పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు ఆ పార్టీ నాయకులు పోలింగ్ కేంద్రాల వారిగా అంచనాలు వేస్తున్నారు. ఏఏ కేంద్రాల్లో తమకు అనుకూలంగా ఓట్లు పడ్డాయో లెక్కలు వేస్తున్నారు. గెలుపు ఓటముల పై దగ్గర వారితో చర్చిస్తూ ఒక అంచనాకు వస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ తో పాటు జిల్లాలో నమోదైన పోలింగ్ ఆధారంగా ప్రజలు కూడా నియోజకవర్గాల గెలుపు ఓటముల పై చర్చ మొదలుపెట్టారు. ఎవరికి వారే అంచనాకు వేస్తూ జోరుగా చర్చ చేస్తున్నారు. ఫలితాలపై బెట్టింగులు కట్టడంతో పాటు ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో.. అంచనాకు వస్తున్నారు. ప్రజలు ఆయా పార్టీల నాయకులు అంచనాలు వేస్తుండగా కౌంటింగ్ సమయం దగ్గర పడడంతో పోటీ చేసిన అభ్యర్థుల్లో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.
పోలింగ్ ప్రశాంతం…
కరీంనగర్ జిల్లాలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 10,59,215 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో 1338 పోలింగ్ బూతులు ఏర్పాటు చేయగా 7,97,720 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తంగా 75.32 శాతం పోలింగ్‌ నమోదైంది. గురువారం రాత్రి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు స్ట్రాంగ్ రూములకు చేరాయి. అధికారులు కౌంటింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లాలో ప్రజలు ఆయా పార్టీల నాయకులు మాత్రం నాలుగు నియోజకవర్గాలపై భారీ చర్చను చేస్తున్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి నాయకులతో పాటు ఇతర పార్టీల నాయకులు పోలింగ్ ఆధారంగా ఒక అంచనాకు వస్తున్నారు. ఎవరికి వారే ఆయా కేంద్రాల్లో జరిగిన పోలింగ్ ను బట్టి ఫలితాలను అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఈ దఫా మూడు పార్టీల నేతలు భిన్నమైన అంశాలను తీసుకొని ప్రచారానికి దిగారు. ఎక్కువగా తమ పార్టీలు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో.. వివరిస్తూ ముందుకు సాగారు. ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకోవడంతో పాటు అధికార పార్టీకి సంబంధించిన వారిపై విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ ప్రచారాలు కొనసాగించారు. అన్ని ప్రచారాలతో పాటు పోలింగ్ కూడా ప్రశాంతంగా జరిగింది. ఈవీఎంలు కూడా స్ట్రాంగ్ రూములకు చేయడంతో ఒక్కొక్క నియోజకవర్గంపై ఒక్కొక్క అంచనాకు వస్తున్నారు. ఈ దఫా జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో విభిన్న తీర్పులు వస్తాయని అంచనా వేస్తున్నారు.
ఫలితాలపై బెట్టింగులు…
ఏ పార్టీకి వన్ సైడ్ రాకుండా అన్ని పార్టీలకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఫలానా పార్టీల అభ్యర్థులు గెలుస్తారని బెట్టింగులు కూడా కడుతున్నారు. ఎవరికి వారే గ్రామాల వారిగా లెక్కలు వేస్తున్నారు. ఏ పోలింగ్ కేంద్రంలో ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పడ్డాయో చెక్ చేస్తూ పూర్తిస్థాయిలో అంచనాకు వస్తున్నారు. తెల్లవారితే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ఫలితాలపై చర్చలు సాగుతున్నాయి. రాష్ట్రస్థాయిలో ఇచ్చిన ఎగ్జిట్ పోల్ వివరాలు తీసుకుంటూ తమ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల వారిగా ఓటింగ్ శాంతాన్ని అంచనా వేస్తున్నారు. జిల్లాలో చర్చ కొనసాగుతుండగా పోటీ చేసిన అభ్యర్థుల్లో మాత్రం టెన్షన్ పెరిగిపోతుంది. నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల వారి అంచనాకు వచ్చిన అభ్యర్థులు ఆందోళన గురవుతున్నారు. ఇదఫా తమ అంచనాలు మారి ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఎవరికి వారే దగ్గరి వారి ద్వారా అంచనాలు కొనసాగిస్తున్నారు. కౌంటింగ్ ఒకరోజు ఉండడంతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 3న జరిగే కౌంటింగ్ ప్రక్రియతో అభ్యర్థుల, నాయకుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది.