ఎన్నికలకు సర్వం సిద్ధం

ఎన్నికలకు సర్వం సిద్ధం
. నేడే పోలింగ్
. నియోజకవర్గంలో 305 పోలింగ్ కేంద్రాలు
. 1268 మంది సిబ్బంది
. 2,49,558 మంది ఓటర్లు

హుజురాబాద్:
నేడు జరిగే సాధారణ శాసనసభ ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎన్నికల సిబ్బంది మొదలుకొని పోలిస్ బందోబస్తు వరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయా పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని, ఇవిఎం, వివి ప్యాట్, ఎన్నికల సామాగ్రిని తరలించేందుకు అవసరమైన వాహనాలను సమకూర్చారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. నియోజకవర్గంలోని 305 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సర్వం ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో ఐదు మండలాలతో పాటు రెండు మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా భద్రత చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలో 114 గ్రామలు ఉండగా 305 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2,49,558 మంది ఓటర్లు ఉండగా అందులో 1,21,809 మంది పురుషులు, 1,27,743 మంది మహిళలు, 6 థర్డ్ జండర్ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణకు 1268 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. అందులో 1220 మంది సిబ్బందికి డ్యూటీలు వేయగా మరో 48 మందిని రిజర్వులో ఉంచినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఇప్పటికే గ్రామాల్లో పోలింగ్ స్లిప్ల పంపిణీ పూర్తి చేశారు. వివిధ కారణాలతో పోలింగ్ స్లిప్లు లేకున్నా ఎన్నికల సంఘం గుర్తించిన ఎవైన గుర్తింపు కార్డులను చూపించి ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం వేసులుబాటును కల్పించింది. స్థానిక ఎన్నికల అధికారి ఎస్ రాజు పర్యవేక్షణలో వివిధ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ర్యాండమైజేషన్ పూర్తి చేసి ఇవిఎంలను సీల్ వేసి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంల్లో భద్ర పరిచారు. ఇవిఎం, వివి ప్యాట్లను బుధవారం పోలింగ్ కేంద్రాల వారిగా కెటాయించి సంబంధిత అధికారులకు అందజేశారు. పోలింగ్ బూతుల వారిగా సిబ్బందిని బస్సుల్లో భద్రతతో తరలించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు, ఎన్నికల సహాయ అధికారులు సిబ్బందికి పోలింగ్ బూతూలను కేటాయించారు. హుజరాబాద్ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. ఈ ఎన్నికల పోలింగ్ కోసం 383 కంట్రోల్ యూనిట్లు, 610 బ్యాలెట్ యూనిట్లు,153 బ్యాలెట్ యూనిట్లు, 305 వివి ప్యాడ్ యూనిట్లు, అదనంగా 122 వివి ప్యాడ్ యూనిట్లు వినియోగిస్తున్నారు. మొత్తం 1875 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. పోలింగ్ సిబ్బందికి కెటాయించిన సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. 305 పోలింగ్ స్టేషన్ లలో లైవ్ వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు. నియోజకవర్గ ఎన్నికల అధికారి తోపాటు ఇద్దరు సహాయ ఎన్నికల అధికారులు, 30 మంది సెక్టోరోల్ అధికారులు ఎన్నికల ప్రక్రియను నిర్వహించనున్నారు.