హుజరాబాద్ లో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
. 70.23 శాతం పోలింగ్

హుజురాబాద్:
హుజురాబాద్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నియోజకవర్గంలో 114 గ్రామాల్లో 305 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను ఏర్పాట్లుతో పాటు వైద్య శిభిరాలను సైతం ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అక్కడక్కడ ఇవిఎంలు కొన్ని నిమిషాలు మోరయించాయి. అయినప్పటికి పోలింగ్ సజావుగా సాగింది. నియోజకవర్గం మొత్తంగా 2,49,588 మంది ఓటర్లు ఉండగా అందులో సాయంత్రం ఐదు గంటల వరకు 1,75,286 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల నిర్వహణకు 1220 మంది పోలింగ్ సిబ్బంది సేవలందించారు. పోలింగ్ సమయం ముగిసినప్పటికీ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారికి ఓటేసేందుకు అనుమతి ఇవ్వడంతో లైన్లో వేచి ఉండి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుమారు రాత్రి 7 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగినట్లు అధికారులు తెలిపారు. యువత ఉత్సాహంతో ఓటింగ్లో పాల్గొన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఇవిఎంలను కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్.ఆర్.ఆర్ కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. ఎన్నికల సందర్భంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా హుజురాబాద్ ఏసిపి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
సొంత గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థులు..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ మండలంలోని సింగపూర్ గ్రామంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి వీణవంక మండల కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బిజెపి పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ కమలాపూర్ మండల కేంద్రంలో తన కుటుంబ సభ్యులతో ఓటు హక్కును వినియోగించుకున్నారు.