ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి

0

నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి..
. రాజకీయ పార్టీల సహకారం అవసరం..
. ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి
. ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి
. ఈ నెల 18 నుండి 25 వరకు నామినేషన్ల స్వీకరణ.
. అభ్యర్థులు రూ. 95 లక్షలకు మించి ఖర్చు చేయరాదు.
కరీంనగర్:
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. ఏప్రిల్ 18  నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ అంశాలను కలెక్టర్ కూలంకశంగా వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఈనెల 18 నుండి  25 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని తెలిపారు. 26న  నామినేషన్ల పరిశీలన, 29వ తేదీన ఉపసంహరణ ఉంటుందని వెల్లడించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి ఛాంబర్ లో నామినేషన్ల స్వీకరణ ఉంటుందని,  ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్న 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, మధ్యాహ్నం 3 తర్వాత నామినేషన్లు స్వీకరించడం జరగదని కలెక్టర్ స్పష్టం చేశారు. నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులు వారితోపాటు, అనుమతించే వ్యక్తులు, వాహనాలు, తదితర అంశాలను కలెక్టర్ వివరించారు. నామినేషన్ వేయడానికి ముందే పోటీ చేసే అభ్యర్థి పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకులో ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కోసం కొత్త ఖాతా తెరవాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రచురించే కరపత్రాల విషయంలో ప్రజా ప్రతినిధ్య చట్టంలోని 127-ఏ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు 95  లక్షలకు మించి ఖర్చు చేయవద్దని ఆ ప్రకటనలో జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *