రైతుల నోట్లో మట్టిగొట్టిన బిజెపి, కాంగ్రెస్: మంత్రి కేటీఆర్


కరెంటు కావాల్నా.. కాంగ్రెస్ కావాల్నా..
. రైతుల నోట్లో మట్టిగొట్టిన బిజెపి, కాంగ్రెస్ కు ఓటేయద్దు
. అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తాం
. ఊరూరుకి మహిళా సంఘ భవనాలు నిర్మిస్తాం..
. ఆగం కాకుండా ఆలోచించి ఓటెయ్యండి
. బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిని గెలిపించండి.
• హుజురాబాద్ రోడ్ షోలో మంత్రి కేటీఆర్
• భారీగా తరలి వచ్చిన జనం

హుజురాబాద్:
24 గంటల కరెంటిచ్చే పార్టీ కావాలో.. మూడుగంటల కరెంటిచ్చే పార్టీ కావాలో ప్రజలే ఆలోచించుకోవాలని మంత్రి కేటీఆర్ ఉన్నారు. హుజురాబాద్ పట్టణంలోని సూపర్ బజార్ రోడ్డులో సోమవారం బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తో కలిసి మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చావు నోట్లో తలపెట్టి కేసీఆర్‌ తెలంగాణను సాధించారని, ప్రజలంతా అవకాశం ఇస్తే ముఖ్యమంత్రిగా రెండు టర్ములు పనిచేశారని చెప్పారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఏం చేశారని మాట్లాడుతున్నారని.. రైతుబంధును ప్రవేశపెట్టిందే కేసీఆర్‌ అని, రైతుబీమా, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌, రూ.2 వేల పెన్షన్‌, ఆడబిడ్డలకు కేసీఆర్‌ కిట్‌ ఇచ్చారని చెప్పారు. కరెంటు మంచిగ చేసిన కేసీఆర్‌.. బతుకులు బాగుచేసిన‌, రైతును రాజును చేసిన కేసీఆర్‌ను వద్దని.. 55 ఏండ్లు మనల్ని సావగొట్టిన కాంగ్రెసే ముద్దని కొందరు అంటున్నారని విమర్శించారు. అధికారంలోకి రాకముందే రైతు బంధును ఆపించి రైతుల నోట్లో మట్టిగొట్టారని మంత్రి కేటీఆర్ అన్నారు. పొరపాటున ఆ పార్టీలు అధికారంలోకి వస్తే రైతుబంధును మొత్తానికే ఎత్తగొడతారని చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీ కలిసి కొత్త కుట్రకు తెరలెపి రైతుబంధును ఆపేశాయని విమర్శించారు. రైతు బంధు ఇవ్వొద్దని కాంగ్రెస్ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారని తెలిపారు. తెలంగాణలో చాలామందికి మూడెకరాలోపే భూమి ఉన్నదని, 3 గంటల కరెంటు సరిపోతుందని.. 24 గంటల కరెంట్‌ ఎందుకని రేవంత్‌ రెడ్డి అంటున్నాడన్నారు. రైతు బంధు రైతుకిస్తే కౌలుదారుకు ఇవ్వమని, కౌలుదారుకిస్తే రైతుకిచ్చేది లేదని పీసీసీ చీఫ్‌ ప్రకటించాడని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ కొత్తదేమీ కాదని, చెత్తపార్టీ అన్ని విమర్శించారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు అడుగుతున్నారని, ఇప్పటివరకు 11 సార్లు అవకాశం ఇస్తే తాగు నీరు, సాగు నీరివ్వలేదు, కరెంటు, పెన్షన్లు ఇవ్వలే, సంక్షేమం సక్కగ చేయకుండా జీవితాలను ఆగంచేశారని విమర్శించారు. రైతులను ఆగం చేసిందని, మన బతుకులను నాశనం చేసిందని, తెలంగాణను బొందపెట్టే ప్రయత్నం చేసిన పార్టీ, 55 ఏండ్లు మన పిల్లలను సావగొట్టిన పార్టీ, తెలంగాణ ఇవ్వకుండా వందల మంది పిల్లల ప్రాణాలు తీసిన పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అన్నారు. కాంగ్రెస్‌ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. 1956లో ఒక్క తప్పు చేసి 58 ఏండ్లు మనల్ని వెంటాడిందని, మరోసారి అదే తప్పు చేయొద్దన్నారు. పట్వారీలు, దళారీలు మరోసారి కావాల్నా అని ప్రశ్నించారు. కరెంటు కావాలా.. కాంగ్రెస్‌ కావాలో ఆలోచించుకోవాలని సూచించారు. కరెంటు కావాలంటే కాంగ్రెస్‌ ఉండొద్దని, కాంగ్రెస్‌ వస్తే కరెంటు ఉండదని చెప్పారు. నాడు ఇన్వర్లర్లు, జనరేటర్లు పెట్టుకునేదని, ఇప్పుడు అవి కనిపిస్తున్నాయా? అని ప్రశ్నించారు. కాలిపోయే మోటర్లు రాక వైండింగ్ దుకాణాలు కూడా మూత పడ్డాయని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ కు ఓటేస్తే ఇవన్నీ మళ్లీ మన కండ్ల ముందు కనిపిస్తాయని చెప్పారు. అందుకే కరెంట్ కావాలా… కాంగ్రెస్ కావాలా అనేది మీరే తేల్చుకోవాలని ప్రజలనుద్దేశించి సూచించారు.
ప్రజా సంక్షేమం కోసం సరికొత్త మేనిఫెస్టో…
మరోసారి అధికారంలోకి వస్తే ఆడపిల్లల కోసం నెలకు రూ.3 వేల ఇచ్చేలా సౌభాగ్యలక్ష్మి పథకం తీసుకొస్తున్నామని, ఆసరా పెన్షన్లను రూ.5 వేలకు పెంచుతామన్నారు. మోడీ పెంచిన సిలిండర్‌ ధరను తగ్గిస్తున్నామని రూ.400లకే అందిస్తామని చెప్పారు. అర్హులందరికి కొత్త పెన్షన్లు, రేషన్‌ కార్డులను జనవరిలో ఇస్తామన్నారు. తెల్ల రేషన్‌ కార్డులున్నవారికి సన్న బియ్యం ఇస్తామన్నారు. కేసీఆర్‌ బీమా.. ప్రతి ఇంటికి ధీమా అన్నారు. అసైండ్‌ భూములున్న ప్రతిఒక్కరికి పూర్తి యాజమాన్య హక్కు కల్పిస్తామని చెప్పారు. కేసీఆర్‌ బొండిగ పిసికేస్తే తెలంగాణ గురించే అడిగేవాళ్లు ఉండరనే ఉద్దేశంతో కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన అగ్రనాయకులు రాష్ట్రంపై దండయాత్ర చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణను ఢిల్లీ చేతుల్లో పెట్టొద్దన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని నమ్మి ఓటేస్తే 2014లో రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ను ఇప్పుడు రూ.1,200 చేశారని మండిపడ్డారు. వచ్చే తమ ప్రభుత్వంలో రూ.800 భరించి రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. జనవరిలో కొత్త రేషన్ కార్డులు అందిస్తామని, రాష్ట్రంలోని అన్ని రేషన్ కార్డులపై సన్న బియ్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఊరు ఊరికి సమ్మక్క సారక్క పేరుతో మహిళా సంఘాల భవనాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి మంచి పనులు చేసుకోవాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని సూచించారు. దున్నపోతుకు గడ్డివేసి ఆవు పాలు పిండినట్లు.. పని చేయని వాళ్లకు ఓట్లు వేసి పని చేసే వాళ్లను విస్మరించవద్దని విజ్ఞప్తి చేశారు. హుజురాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా: పాడి కౌశిక్ రెడ్డి
ఈ ఎన్నికల్లో తనకు ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని కమలాపూర్ మండలాన్ని మున్సిపాలిటీగా, చల్లూరు, వావిలాల, ఉప్పల్ గ్రామాలను మండలాలుగా చేయాలని మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. మంత్రి కేటీఆర్ సహకారంతోనే హుజురాబాద్ పట్టణంలో 10 కోట్లతో అద్భుతమైన స్పోర్ట్స్ స్టేడియాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ ఏడుసార్లు అవకాశం ఇచ్చిన ఈటల హుజురాబాద్ కు చేసిందేమీ లేదన్నారు. కేవలం ఈటల తన సొంత అభివృద్ధి తప్ప ప్రజల సమస్యలను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. తనను ఆదరించి ఆశీర్వదించాలని ఎల్లవేళలా ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రోడ్డు షో లో రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, బిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


భారీగా తరలివచ్చిన జనం…
సూపర్ బజార్ లో జరిగిన మంత్రి కేటీఆర్ రోడ్ షోకు వేలాదిమంది తరలివచ్చారు. సూపర్ బజార్ రోడ్డు మొత్తం జనంతో కెక్కిరిసిపోయింది. కేటీఆర్ సీఎం అంటూ నినాదాలు మార్మోగాయి. రామక్క పాటతో రోడ్ షో కి వచ్చిన జనం కేరింతలు కొడుతూ డాన్సులు చేశారు. కౌశిక్ రెడ్డి మా ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు.