భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ రావాలి

మాయమాటలతో మోసం చేస్తున్న బిఆర్ఎస్, బిజెపి
– భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ రావాలి
– అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీ
– ఆదరించి ఆశీర్వదించండి..
– కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్

హుజురాబాద్ :
బిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు హామీలు ఇచ్చుడు మోసం చేసుడు తప్పితే అభివృద్ధి చేసేది లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ అన్నారు. గురువారం కమలాపూర్ మండలంలోని మదన్నపేట, గునిపర్తి, శ్రీరాములపల్లి, అంబాల, నేరెళ్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే భవిష్యత్తు బాగుంటుందన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజులకు హామీలను అమలు చేస్తామన్నారు. బిఆర్ఎస్, బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయదని అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, అక్కడ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, కర్ణాటక రాష్ట్రంలో 62 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని హామీలన్నీ అమలు చేస్తుందన్నారు. మేనిఫెస్టోను కాపీ చేసి పింఛన్లు పెంచేస్తామని బిఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుందని, ఉన్న పింఛన్లు సమయానికి ఇవ్వడం లేదు కానీ కొత్త పింఛన్లు ఇస్తామని హామీ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు.

అధికారంలోకి రాగానే రెండు లక్షల ఖాళీల భర్తీ…
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. యువకులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు సరైన వసతులు లేవని, తనను గెలిపిస్తే హుజురాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో డిజిటల్ లైబ్రరీలతోపాటు స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తానని హామీ ఇచ్చారు. వేయికోట్ల నిధులతో హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మాటలు చెబుతున్నా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఎవరు ఆపారన్నారు. మండలానీకో ఇంటర్నేషనల్ స్థాయి పాఠశాల ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి విద్యానందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రెండు దశాబ్దాలుగా ప్రజలు ఈటెల రాజేందర్ ను గెలిపిస్తూ వస్తున్నారని, ఈ నియోజకవర్గ ప్రజలను కాదని గజ్వేల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు. గజ్వేల్ కు వెళ్లి గజ్వేల్ ముద్దుబిడ్డనని, హుజురాబాద్ కు వచ్చి హుజురాబాద్ బిడ్డనని చెప్తున్నాడని ఎద్దేవా చేశారు. ఏడుసార్లు అవకాశం ఇచ్చినప్పటికీ ఈ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల్లో గెలిచి మూడేళ్లు గడుస్తున్న హుజురాబాద్ కు ఏం అభివృద్ధి చేయలేదని, కనీసం తన సొంత మండలమైన కమలాపూర్ మండలంలోని ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని సైతం పూర్తి చేయలేని పరిస్థితిలో ఈటెల రాజేందర్ ఉన్నారన్నారు.

బిజెపికి ఓటు వేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లే…
బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని బిజెపికి ఓటు వేస్తే బిఆర్ఎస్ కు వేసినట్టేనని, బిఆర్ఎస్ కు వేస్తే బిజెపికి వేసినట్లేనని తెలిపారు. ప్రశాంతంగా ఉన్న హుజురాబాద్ లో రౌడీయిజం, అరాచకాలు, గన్ కల్చర్ పెరిగిపోయిందని అన్నారు. వ్యాపారులు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. వ్యాపారులకు స్వేచ్ఛ ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వ్యాపారాలను అభివృద్ధి చేయడంతో పాటు పరిశ్రమలను తీసుకువచ్చి ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. వ్యాపారులెవరు అధైర్య పడవద్దని హుజురాబాద్ నియోజకవర్గం లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. వ్యాపారులకు అండగా ఉంటూ వారి అభివృద్ధి తోపాటు హుజూరాబాద్ ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో. మండల అధ్యక్షుడు చరణ్ పటేల్, సీనియర్ నాయకులు బాలసాని రమేష్ గౌడ్, దేశిని ఐలయ్య, తవటం రవీందర్, వంశీధర్ రావు, బిక్షపతి, శివ చరణ్, శ్రీనివాస్, హనుమాన్ ప్రసాద్ పలు గ్రామాల అధ్యక్షులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.