ఉచిత విద్యుత్ అందించిన ఘనత కాంగ్రెస్ దే : కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్

ఉచిత విద్యుత్ అందించిన ఘనత కాంగ్రెస్ దే..
. యువత అభివృద్ధి బాధ్యత నాదే..
. మోసపూరిత పార్టీల నాయకుల మాటలు నమ్మొద్దు
. ఆశీర్వదించి అవకాశం ఇవ్వండి
. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్

హుజురాబాద్:
రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు మొదటగా అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని ఆ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ అన్నారు. ఆదివారం పట్టణంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని యువత అభివృద్ధి బాధ్యత నాదేనని, పోటీ పరీక్షలకు యువత సిద్ధమయ్యేందుకు స్టడీ సెంటర్లు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తానన్నారు. ఉచిత విద్యుత్తు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని, రైతులెవ్వరు మోసపూరిత మాటలు నమ్మవద్దన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజులకు హామీల అమలు చేస్తామన్నారు. బిఆర్ఎస్, బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టీ హామీల పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని హామీలన్నీ అమలు చేస్తామని తెలిపారు. పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునే అవకాశం తెలంగాణ ప్రజలకు వచ్చిందన్నారు. వేయికోట్ల నిధులతో హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మాటలు చెబుతున్నా బిఆర్ఎస్ అభ్యర్థిని ఎవరు ఆపారని ఆడిగారు. మండలానీకో ఇంటర్నేషనల్ స్థాయి పాఠశాల ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి విద్యానందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈటల చేసింది ఏమీ లేదు..
ఏడుసార్లు అవకాశం ఇచ్చినప్పటికీ ఈ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు దశాబ్దాలుగా ప్రజలు ఈటల రాజేందర్ ను గెలిపిస్తూ వస్తున్నారని, ఈ నియోజకవర్గ ప్రజలను కాదని గజ్వేల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు. గజ్వేల్ కు వెళ్లి గజ్వేల్ ముద్దుబిడ్డనని, హుజురాబాద్ కు వచ్చి హుజురాబాద్ బిడ్డనని చెప్తున్నాడని విమర్శించారు. ఉప ఎన్నికల్లో గెలిచి మూడేళ్లు గడుస్తున్న హుజురాబాద్ కు ఏం చేయలేదని, కనీసం తన సొంత మండలమైన కమలాపూర్ లో ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని సైతం పూర్తి చేయలేని పరిస్థితిలో ఈటల రాజేందర్ ఉన్నారన్నారు. బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని బిజెపికి ఓటు వేస్తే బిఆర్ఎస్ కు వేసినట్టేనని, బిఆర్ఎస్ కు వేస్తే బిజెపికి వేసినట్లేనని తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గం లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సొల్లు బాబు, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు యేముల పుష్పలత, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు ఎండి అప్సర్, నాయకులు ఖాళిక్ హుస్సేన్, ఉప్పు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.