హుజురాబాద్ ప్రజలకు అండదండగా ఉంటా.. సీఎం కేసీఆర్

రాయి ఏదో.. రత్నమేదో తేల్చాలి.. నిజం ఏదో గమనించి ఓటేయాలి
. రైతుబంధు ఉండాలా పోవాలా..కావాలంటే బిఆర్ఎస్ గెలువాలే..
. ఉత్సాహవంతుడైన కౌశిక్ రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వండి
. హుజురాబాద్ కు అండదండగా ఉంటా..
. జమ్మికుంట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్

హుజురాబాద్:
ఎన్నికలు వచ్చాయంటే ఇష్టం వచ్చిన మాటలు ఉంటాయని ప్రజలు మాత్రం రాయి ఏదో.. రత్నమేదో.. తేల్చాలని నిజమేదో గమనించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో శుక్రవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీ ఈ రోజు మ్యానిఫెస్టో విడుదల చేసిందని, దానిలో ఇప్పుడున్న ధరణిని తీసేసి దాని స్థానంలో భూ భారతిని తీసుకొస్తమని ప్రటించిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. భూ భారతి కొత్తదేం కాదని, గతంలో తీసుకొచ్చారని, అయినా దానితోటి ఏం కాలేదని సీఎం చెప్పారు. భూ భారతి తెచ్చినా గదే పైరవీకారులు, గదే దళారీలు ఉండేదని గుర్తుచేశారు. కాబట్టి మీరు బాగా ఆలోచించాలన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ 24 గంటల కరెంటు ఇస్తున్నదని, కాంగ్రెస్‌ పార్టీ మూడు గంటలు చాలు అంటున్నదన్నారు. 24 గంటలు కావాల్నో.. మూడు గంటలు కావాల్నో మీరే తేల్చాలి. మేం రైతుబంధు ఇస్తున్నం. కాంగ్రెసోళ్లు రైతుబంధు వేస్ట్‌ అంటున్నరు. రైతుబంధు ఇచ్చెటోళ్లు కావాల్నో.. రైతుబంధు వేస్ట్‌ అనేటోళ్లు కావాల్నో మీరే నిర్ణయించుకోవాలె’ అని సీఎం సూచించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ భూముల క్రయవిక్రయాల్లో అక్రమాలకు తావు లేకుండా ధరణి పోర్టల్‌ తెచ్చిందన్నారు. కాంగ్రెస్ వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తమంటున్నరన్నారు. ధరణి పోర్టల్‌ను ఉంచుకుంటరో.. బంగాళాఖాతంల వేసుకుంటరో మీ ఇష్టం అన్నారు. రైతులకు మేలు జేసేటోళ్లు కవాల్నో.. కిందమీద జేసేటోళ్లు కావాల్నో మీరే తేల్చుకోవాలన్నారు. ఆలోచించకుంట ఓటేస్తే ఆగమైతరన్నారు. ఆలోచించి, ఎవరిని గెలిపిస్తే రాష్ట్రం బాగుపడుతదో చూసి ఓటేయాలన్నారు. ఇంక వావిలాల, చల్లూరు, ఉప్పల్ గ్రామాలను మండలాలు చేయాలని మీ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కోరిండని, అదేం పెద్దపని కాదన్నారు. కౌశిక్ రెడ్డి గెలువగానే జీవో ఇష్యూ చేసి మండలాలు ఏర్పాటు చేస్తమన్నారు. మీరు ముందుగా కౌశిక్ రెడ్డిని గెలిపియ్యండి. మండలాల ఏర్పాటుతోపాటు కౌశిక్ రెడ్డి కోరిన ఇంకా కొన్ని పనుల సంగతి నేను చూసుకుంట’ అని సీఎం హామీ ఇచ్చారు.

ఏ పార్టీల చరిత్ర ఏంటో ఆలోచించాలి…
రాష్ట్రంలో ఏ పార్టీల చరిత్ర ఏంటో ప్రజలు, మేధావులు, విద్యావంతులు ఆలోచించాలని, అభ్యర్థుల గుణ గణంతో పాటు ఆలోచన చేయాలన్నారు. అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీలపై చర్చ జరగాలన్నారు. ఆలోచించి ఓటు వేస్తే అది ప్రజా గెలుపు అవుతుందన్నారు. బిఆర్ఎస్ పార్టీ పుట్టిందే ప్రజల కోసమని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ అని అన్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీల వైఖరి ఏంటో ప్రజలు చూడాలన్నారు. మంది మాటలు పట్టుకోవద్దని, ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు లాభమో ఆలోచించాలన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాం కానీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వలేదన్నారు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అంటేనే కాంగ్రెస్ పార్టీ దిగొచ్చిందన్నారు. బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన పదేళ్లలో దేశంలో 108 మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే ఒకటి కూడా తెలంగాణకు ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్ర విభజన చట్టాన్ని సైతం బిజెపి పార్టీ ఉల్లగించిందన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాకు ఎన్ని నవోదయ పాఠశాల కావాలో ప్రధాని ప్రధాని మోడీకి 100 ఉత్తరాలు రాసిన స్పందన కరువైందన్నారు. రాష్ట్రానికి ఒక నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదన్నారు. దీనిపై ఇక్కడ బిజెపి నాయకులు ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. ఒక్క మెడికల్ కాలేజ్, నవోదయ పాఠశాల ఇవ్వని బిజెపికి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. రైతుల కరెంట్ మోటర్లకు మీటర్లు పెట్టాలని మోడీ చెప్పాడన్నారు. కానీ రైతు సంక్షేమం కోసమే నేను దాన్ని అమలు చేయలేదన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టకపోవడంతో ఐదేళ్లలో రాష్ట్రానికి రావలసిన వాటాలో 25 వేల కోట్ల కోత విధించాడని తెలిపారు. మంచి వైపు పోతే మంచి జరుగుతుందని, చెడువైపోతే చెడే జరుగుతుందన్నారు. పాలిచ్చే బర్రెను వదిలేసి దున్నపోతులు తెచ్చుకుంటే ఏం లాభం ఉంటుందో ప్రజలంతా ఆలోచించాలన్నారు. 100 శాతం బిఆర్ఎస్ ప్రభుత్వమే రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉండే బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. యువకుడు ఉత్సాహవంతుడైన కౌశిక్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

హుజరాబాద్ అభివృద్ధికి 1000 కోట్ల నిధులు తెస్తా…
ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపిస్తే హుజురాబాద్ అభివృద్ధికి 1000 కోట్ల నిధులు తెస్తానని బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న బిఆర్ఎస్ పార్టీని ఆదరించి తనకు ఒక అవకాశం ఇస్తే మీకు సేవ చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలోని ఉప్పల్, చల్లూరు, వావిలాల గ్రామాలను మండలాలుగా చేయాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి గత రెండు సంవత్సరాలుగా ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించాడు. ఇక్కడి ప్రజలు ఓటేసి గెలిపిస్తే మోసం చేసి గజ్వేల్ కు వెళ్లాడని విమర్శించారు. ఈ సభలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి లక్ష్మీ కాంతారావు, మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టూరిజం కార్పొరేషన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

భారీగా తరలివచ్చిన జనం…
జమ్మికుంట లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గంలోని నలుమూలల నుండి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. సభకు వచ్చిన జనంతో డిగ్రీ కళాశాల మైదానం కిక్కిరిసిపోయింది. బిఆర్ఎస్ నినాదాలతో మార్మోగింది.

ఆకట్టుకున్న కళాకారుల ఆటపాట..
ప్రజా ఆశీర్వాద సభ సందర్భంగా కళాకారుల ఆటపాటలు ప్రజలను ఆకట్టుకున్నాయి. బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల పై కళాకారులు పాడిన పాటలను ఆసక్తిగా విన్నారు. అంతేకాకుండా ఉత్సాహంతో కొంతమంది నృత్యాలు చేశారు.