కబ్జా స్థలాలపై బుల్ డోజర్లు దించుతా : బండి సంజయ్

నేను గెలిస్తే…. కబ్జా స్థలాలపై బుల్ డోజర్లు దించుతా..
. ఆ స్థలాల్లో పేదలకు ఇండ్లు కట్టించి పంచి తీరుతా…
. నగునూరులో బీఆర్ఎస్ నేతలు కబ్జా చేసిన 26 ఎకరాల సంగతి తేలుస్తా
. నాపై అవినీతిని నిరూపిస్తే ఉరేసుకునేందుకు సిద్ధం
. మీ భూకబ్జాల చరిత్రను నిరూపిస్తా… ఏ శిక్షకైనా సిద్ధమా?
. కరీంనగర్ లో ఎగిరేది కాషాయ జెండానే
. బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్..

కరీంనగర్:
బీఆర్ఎస్ నేతలు కబ్జా చేసిన స్థలాల్లో బుల్ డోజర్లు దించుతా… వాటిని స్వాధీన పర్చుకుని ఆ స్థలాల్లో పేదలకు ఇండ్లు కట్టించి పంచుతానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ నేతల భూకబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని, తనను గెలిపిస్తే వాళ్ల సంగతి తేలుస్తానని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం కరీంనగర్ లోని నగునూరుతో పాటు నగరంలోని 17, 38, 39వ డివిజన్లకు వచ్చిన బండి సంజయ్ కు స్థానికులు డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. పూలు చల్లి, తిలకం దిద్ది హారతి పట్టారు. గజమాల వేసి అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశంలో 3 కోట్ల ఇండ్లు కట్టించిందన్నారు. తెలంగాణకు 2 లక్షల 40 వేల ఇండ్లు మంజూరు చేసిందని అవి కట్టిస్తే మరో 5 లక్షలు ఇండ్లు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. కానీ ఇంతవరకు కేసీఆర్ ఒక్క ఇల్లు కూడా పేదలకు పంచకుండా ఆ నిధులను దారి మళ్లించిండని ఆరోపించారు. నగునూరులోని దుర్గామాత గుడి సమీపంలో 669 సర్వే నెంబర్ 26 ఎకరాల భూమిని బీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారన్నారు. నన్ను గెలిపిస్తే జాగాలను స్వాధీనం చేసుకుని పేదలకు పంచిపెడతా… నేను మాటిస్తే తప్పను.. బరాబర్ ఆ భూములను పేదలకు పంచి తీరుతానని హామీ ఇచ్చారు. కరీంనగర్ లో పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్ధుల చరిత్రను పరిశీలించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరు ప్రజల కోసం పోరాడుతున్నారో, ఎవరు భూకబ్జాలకు పాల్పడుతున్నారో బేరీజు వేయాలన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలిద్దరూ భూకబ్జాదారులేనని, వారు ఎన్నికల సంఘానికి అందజేసిన అఫిడవిట్ లోనే వారెంతటి భూకబ్జాదారులో, అక్రమ సంపాదన పరులో అర్ధం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయన్నారు. దమ్ముంటే నాపై చేసిన అరోపణలను నిరూపించాలని.. నిరూపిస్తే ఉరేసుకుంటా… మీ అక్రమ సంపాదన, మీ కబ్జా భాగోతాలు డాక్యుమెంట్లు, ఆధారాలతోసహా నిరూపిస్తా… మీరు ఏ శిక్షకైనా సిద్ధమా? దమ్ముంటే నా సవాల్ ను స్వీకరించాలన్నారు.