ఉద్యోగాల కల్పనలో బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలం

0
  • కోచింగ్ కు పెట్టిన అప్పులు తీర్చలేక గోస పడుతున్న యువత
  • ఇందిరమ్మ ఇల్లు లేవు.. నిరుద్యోగ భృతి లేదు
  • కాంగ్రెస్ వచ్చాక ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తాం
  • ఆదరించి ఆశీర్వదించండి
  • కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్

హుజురాబాద్:
ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ ఆరోపించారు. శుక్రవారం నియోజకవర్గంలోని కమలాపురం మండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో దేశం సస్యశ్యామలంగా ఉన్నదన్నారు. ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ పథకాలను వెంటనే అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును ఇవ్వనున్నట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతినెల రూ. 2500 ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు. రూ. 500 కే గ్యాస్ సిలిండర్ ఇవ్వబడుతుందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరుగుతుందని తెలిపారు. రైతు భరోసా పథకం, గృహ జ్యోతి, యువ వికాసం పథకాల గూర్చి వివరించారు. పేద వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షల సాయం చేస్తుందని తెలిపారు. వృద్ధులకు రూ. 4 వేల చేయూత ఫించన్ ఇవ్వడం జరుగుతుందన్నారు.

నిరుద్యోగులకు మొండి చేయి…
నిరుద్యోగ విద్యార్థి యువకులకు ఉద్యోగాలు కల్పించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం మొండి చేయి చూపిందన్నారు. గత పదేళ్ల ప్రభుత్వ పాలనలో నోటిఫికేషన్లు వేస్తూ రద్దు చేస్తూ యువకులను తీవ్రంగా మానసిక ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు. ఉద్యోగాలు వస్తాయని ఆశతో లక్షల రూపాయలు పెట్టి కోచింగ్ తీసుకుని ఆ అప్పులు తీర్చలేక నిరుద్యోగులు గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ రద్దుతో ఉద్యోగాలు లేక కూలీలుగా మారుతున్నారని, మరికొంతమంది మద్యంకు బానిసై జీవితాలను విచ్ఛినం చేసుకుంటున్నారని తెలిపారు. ఈ విషయంపై నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు వారి తల్లిదండ్రులు ఆలోచించాలన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుండపు చరణ్ పటేల్, సీనియర్ నాయకులు తవుటం రవీందర్, బాలసాని రమేష్, దేశిని ఐలయ్య, తిప్పారపు యుగంధర్, వంశీ, జనగాని శివకృష్ణ, బిక్షపతి, ఆయా గ్రామాల లీడర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *