రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను గుర్తించాలి

0

సంక్షేమ పథకాల అమలు కోసం అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలి
. రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను గుర్తించాలి
. తక్షణమే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలి
. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్

కరీంనగర్:
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధానమైన 6 హామీలను అమలు చేసేందుకు దరఖాస్తులను స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించడాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్వాగతించారు. అయితే తెల్ల రేషన్ కార్డే అందుకు ప్రధాన అర్హతగా పేర్కొనడం పట్ల సందేహం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో గత పదేళ్లుగా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పటికే 10 లక్షల కుటుంబాలు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు. ఇంకా లక్షలాది కుటుంబాలు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు వేచి చూస్తున్నారన్నారు. వాళ్లందరికీ ఏ విధంగా న్యాయం చేస్తారు’’అని ప్రశ్నించారు. తక్షణమే కొత్త రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానించాలని కోరారు. దీంతోపాటు రాజకీయాలకు అతీతంగా నిజమైన లబ్దిదారులను గుర్తించి 6 పథకాలను అమలు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి జయంతిని పురస్కరించుకుని జిల్లా పార్టీ కార్యాలయంలో ‘‘సుపరిపాలన దినోత్సవం’’ నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్ పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వాజ్ పేయి దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పదవుల కోసం ఎంతటికైనా దిగజారే వ్యక్తులు, పార్టీలున్న ఈరోజుల్లో నమ్మిన సిద్దాంతం కోసం, విలువల కోసం ప్రధానమంత్రి వంటి అత్యున్నత పదవులనే త్రుణ ప్రాయంగా వదిలేసుకున్న మహా నాయకుడు వాజ్ పేయి అన్నారు.

పారదర్శకంగా పథకాలు అమలు చేయాలి…
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అందుకోసం దరఖాస్తులను ఆహ్వానించడాన్ని బీజేపీ పక్షాన స్వాగతిస్తున్నామని తెలిపారు. ఎన్నికలు రాబోతున్నాయని, ఆలోపే లబ్దిదారులను గుర్తించాలని, ఎన్నికల సాకుతో బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా దరఖాస్తులకే పరిమితం కావొద్దని కోరారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో నమ్మించి మోసం చేసిందని, హామీలిచ్చి చేతులు దులుపుకోవడంవల్లే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారన్నారు. ఆ తప్పు కాంగ్రెస్ చేయొద్దని కోరుతున్నానన్నారు. నిజమైన లబ్దిదారులను గుర్తించే విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలను, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని కోరారు. అట్లాగే బీజేపీ కార్యకర్తలంతా అర్హులైన వారందరిని గుర్తించి దరఖాస్తు చేయించాలన్నారు. ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల్లోనే 6 పథకాలను అమలు చేయాలన్నారు. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడిస్తారో, ఎప్పటిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసి కాంగ్రెస్ 6 పథకాలను అందిస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. ఎంపీ ఎన్నికలంటేనే మోదీ ఎన్నికలనే భావన ప్రజల్లో ఉందని, ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజారిటీ స్థానాలు గెలుచుకోవడం తథ్యం అన్నారు. బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమన్నారు.

అక్షరాలు మార్చి పత్రాలు రిలీజా…
శ్వేత పత్రం… స్వేద పత్రం అంటు అక్షరాలు మార్చి ఒకరికొకరు పత్రాలు రిలీజ్ చేసుకుంటున్నారని విమర్శించారు. 50 లక్షల కోట్ల ఆస్తులు సృష్టిస్తే… తెలంగాణలో 6.75 లక్షల కోట్ల అప్పులు ఎట్లా చేశారు? భూములెందుకు అమ్ముకున్నడు? జీతాలెందుకు ఇవ్వలేకపోయిండు? బహుశా కేసీఆర్ కుటుంబమే తెలంగాణను అడ్డుపెట్టుకుని 50 లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకుని విదేశాల్లో పెట్టుబడులు పెట్టుకున్నట్లున్నరని సంజయ్ ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *