బ్యాలెట్ యూనిట్ పై రిటర్నింగ్ అధికారుల ద్వారా అవగాహన

బ్యాలెట్ యూనిట్ పై రిటర్నింగ్ అధికారుల ద్వారా అవగాహన
ర్యాండమైజేషన్ క్రమసంఖ్య ఆధారంగా నియోజక వర్గాలకు బియుల పంపిణి
. జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి
కరీంనగర్:
పోలింగ్ రోజు బ్యాలెట్ యూనిట్ ల ద్వారా ఓటు వినియోగంపై ఆయా నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారుల ద్వారా అవగాహనను కల్పించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో కరీంనగర్, హుజురాబాద్ నియోజక వర్గాల కొరకు అదనపు బ్యాలెట్ యూనిట్ ల ర్యాండమైజేషన్ ప్రక్రియ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా డిఈఓ మాట్లాడుతూ… అక్టోబర్ 20, 2023న నిర్వహించిన మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను ద్వారా 2674 బ్యాలెట్ యూనిట్లు, 2089 కంట్రోల్ యూనిట్లు, 2054 వివిపాట్ లను కరీంనగర్ 390, చోప్పదండి 327, మానకొండూర్ 316, హుజురాబాద్ 305 పోలింగ్ కేంద్రాల కొరకు 125 శాతం బియూ, 125 శాతం సియు, 140 శాతం వివిపాట్ ల చోప్పున పంపిణి చేసుకోవడం జరిగిందని పేర్కోన్నారు. నవంబర్ 15న జరిగిన నామినేషన్ల ఉపసంహరణ అనంతరం కరీంనగర్ లో 27 మంది అభ్యర్థులు, హుజురాబాద్ లో 22 మంది, మానకొండూర్ లో 10 మంది, చోప్పదండిలో 14 మంది అభ్యర్థులు పోటిలో ఉన్నారని తెలిపారు. ఒక్క బ్యాలెట్ యూనిట్ ద్వారా 16 మంది అభ్యర్థులకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉందని, కరీంనగర్, హుజురాబాద్ లలో అభ్యర్థులు అదనంగా ఉండడంతో అందుకు అనుగుణంగా జిల్లాలో నిలువ ఉంచిన 1003 బ్యాలెట్ యూనిట్ లకు ర్యాండమైజేషన్ ను నిర్వహించి కరీంనగర్ కు 488, హుజురాబాద్ కు 382 బ్యాలెట్ యూనిట్ లను కేటాయించడం జరిగిందని తెలిపారు. ర్యాండమైజేషన్ అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవియం గోడౌన్ లో ర్యాండమైజేషన్ క్రమ సంఖ్య అధారంగా వేరు చేసి నియోజక వర్గాల పంపిణి కేంద్రాలకు తరలించడం జరుగుతుందన్నారు. కరీంనగర్, హుజురాబాద్ నియోజక వర్గాలలోని ప్రతి పోలింగ్ కేంద్రానికి రెండు బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేయవలసి ఉన్నందున, రిటర్నింగ్ అధికారుల ద్వారా అవగాహనను కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పవన్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి సత్తినేని శ్రీనివాస్, బిజేపి పార్టీ ప్రతినిధి నాంపెల్లి శ్రీనివాస్, సీపీఐ (యం) మిల్కూరి వాసుదేవ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఎస్.కె. సిరాజ్ హుస్సెన్, బిఎస్పి పార్టీ ప్రతినిధి గాలి అనిల్ కుమార్, టీడీపీ పార్టీ ప్రతినిధి కళ్యాడపు ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.