ప్రజల గౌరవం పెంచేలా పని చేస్తా…

0

నియోజకవర్గ ప్రజల గౌరవం పెంచేలా పని చేస్తా…
. వైద్య సహాయం అందించేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటా..
. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
. ఎల్కతుర్తిలో పంచాయతీ భవనం ప్రారంభం

ఎల్కతుర్తి:
తనను ఆదరించి ఆశీర్వదించిన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల గౌరవం పెంచేలా పనిచేస్తానని, నియోజకవర్గంలో వైద్య సహాయం కోసం తనను ఎప్పుడైనా సంప్రదించవచ్చని, 24 గంటలు అందుబాటులో ఉంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో గ్రామ పంచాయతీ లకు సంబంధించిన బిల్లులు రాక గత5 ఏళ్లుగా సర్పంచులు ఇబ్బందులు పడ్డారని, కొంత మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అలా కాకుండా ప్రజా ప్రభుత్వ పాలనలో స్వేచ్ఛ యుత ప్రజా పాలనను అందిస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన రెండు రోజుల్లోనే రెండు హామీలను అమలు చేశామన్నారు. ఆరు గ్యారెంటీ లపై ప్రజలనుండి దరఖాస్తులు స్వీకరించి వాటిని ఆన్లైన్లో నమోదు చేయడం జరిగిందన్నారు. అర్హత ఉన్న వారందరికీ పథకాలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9 కోట్ల మంది మహిళలు జోరో టికెట్ల పై ప్రయాణం చేశారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు.
నీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు..
వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని, సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రభుత్వ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. రాజకీయలకు అతీతంగా ప్రజా సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఎల్కతుర్తిని అన్ని విధాల అభివృద్ధి చేస్తా…
ఎల్కతుర్తి మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానన్నారు. హనుమకొండ, కరీంనగర్ కు ముఖద్వారంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. నిరంతరం ప్రజా సమస్యల పరిస్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, ఎంపీపీ, గ్రామ సర్పంచ్ నిరంజన్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *