సొంతింటి కల నెరవేరాలి

0

జర్నలిస్టుల సొంతింటి కల నెరవేరాలి
. ఇళ్ల స్థలాల సమస్యపై సీఎంతో చర్చిస్తా..
. ప్రొఫెసర్ కోదండరాం

హైదరాబాద్:
జర్నలిస్టుల సొంతింటి కల నెరవేరాలని, ఇళ్ళు ప్రతీ ఒక్కరికి అవసరమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మంగళవారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ..చాలాకాలంగా జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇచ్చే అంశంపై గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల విషయంలో కొంత సానుకూలంగా ఉందన్నారు. ప్రభుత్వం నిర్వహించే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని, ముఖ్యంగా చిరకాల వాంఛ అయిన ప్రత్యేక తెలంగాణ సాధనలో కూడా జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. గత ప్రభుత్వం ఒకటి రెండు చోట్ల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించి, తిరిగి తీసుకున్న సంఘటనలు ఉన్నాయని, అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సమస్య సానుకూలంగా పరిష్కారం జరిగే విధంగా త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించే అంశంపై తనవంతు కృషి చేస్తానని అన్నారు. హైదరాబాద్ జిల్లా సహకార శాఖ అధికారి(డీసీఓ) డి.రమాదేవి మాట్లాడుతూ…తమ శాఖ తరఫున జర్నలిస్టులకు సంబంధించిన సమస్యల పరిష్కారం విషయంలో సంపూర్ణ సహకారం ఉంటుందని అన్నారు. 2008 లో స్థాపించిన ఈ సొసైటీకి చాలా సీనియారిటీ ఉందని, సొసైటీలోని సభ్యులందరూ బాధ్యతగా ఉండాలని, సొసైటీ బైలా ప్రకారం నడుచుకోవాలని సూచించారు. సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 2008 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పడిన ఈ సొసైటీలో దాదాపు 970 మంది జర్నలిస్టులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత పదేళ్లుగా ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు ఇవ్వకుండా జాప్యం చేసిందని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా ఎదిరి చూస్తున్న గ్రేటర్ జర్నలిస్టులకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ళస్థలాలిచ్చి న్యాయం చేయాలని మామిడి సోమయ్య కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి నగర అధ్యక్షుడు నర్సయ్య, సొసైటీ కార్యదర్శి బొల్లం శ్రీనివాస్, కోశాధికారి పిల్లి రాంచందర్, కార్యవర్గ సభ్యులు యర్రమిల్లి రామారావు, భాస్కర్ రెడ్డి, వీరేశం, సీనియర్ జర్నలిస్టులు పులిపలుపుల ఆనందం, షోయబుల్లాఖాన్, బీఆర్ కే మూర్తి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలు అంశాలపై చర్చించి ప్రవేశ పెట్టిన పలు తీర్మానాలను సర్వసభ్య సమావేశం ఆమోదించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *