జిల్లాలో ‘స్నేహిత’ కార్యక్రమం ప్రారంభం

0

బాలిక సాధికారత దిశగా కరీంనగర్…
. ఆడపిల్లలు ఏ సమస్యనైనా ధైర్యంగా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు చెప్పాలి
. భవిష్యత్తుకు విద్యార్థి దశ నుండే పునాది వేసుకోవాలి
. జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి
. జిల్లాలో ‘స్నేహిత’ కార్యక్రమం ప్రారంభం

కరీంనగర్:
బాలిక సాధికారత దిశగా కరీంనగర్ జిల్లాలో స్నేహిత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. బుధవారం తిమ్మాపూర్‌లోని తెలంగాణ రాష్ట్ర మోడల్‌ పాఠశాలలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన స్నేహిత కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని మంచి పనులకు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. ఇంటర్నెట్‌ వల్ల పెడదారి పట్టి జీవితాలను కోల్పోయిన ఎంతోమంది గురించి నిత్యం పతిక్రల్లో చదవుతూనే ఉన్నామని గుర్తు చేశారు. ఆడపిల్లలు ఏ సమస్య ఉన్నా ధైర్యంగా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు చెప్పాలన్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు టోల్‌ఫ్రీ నెంబర్లు, షీ టీములు వంటి ఎన్నో సేవలు ఉన్నాయన్నారు. జిల్లాలోని అధికారులంతా విద్యార్థులు, ఆడపిల్లల శ్రేయస్సుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారన్నారు. ఒక గమ్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా చదువు కొనసాగించడమే విద్యార్థుల పని అని ఉపదేశించారు. భవిష్యత్తుకు విద్యార్థిని దశ నుండే పునాది వేసుకోవాలన్నారు.
జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి మాట్లాడుతూ…
బాలికా సాధికారత దిశగా కరీంనగర్‌ జిల్లాలో ‘స్నేహిత’ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఆడపిల్లల భవిష్యత్తుకు పునాది వేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులను , ఉపాధ్యాయులను భాగస్వాములుగా చేయడం జరిగిందన్నారు. బాలికా సాధికారత కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం జిల్లాలోని రెండు పాఠశాలల్లో ‘స్నేహిత’ కార్యక్రమం ఏర్పాటు చేస్తాయని, ఇందులో విద్యార్థులకు బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు, లింగ వివక్షత, ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన సమతుల ఆహారం, ఆడపిల్లల భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలు వివరించడం జరుగుతుందన్నారు. ఆపదలో వారిని రక్షించేందుకు జిల్లా యంత్రాంగం పని చేస్తున్న తీరు, వారికోసం అందుబాటులో ఉన్న టోల్‌ప్రీ నెంబర్లు, వైద్య సదుపాయాలు, పోలీసు, న్యాయం సహాయం వంటి కార్యక్రమాల మీద అవగాహన కల్పిస్తారు. విద్య ప్రాధాన్యత, భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలపై సూచనలు చేస్తారు. విద్యార్థులు ఎలా పెడదోవ పడుతున్నారని, సన్మార్గంలో నడిచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణులతో అవగాహన కల్పిస్తారని ఆమె తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులు విద్యార్థులకు ఫిజికల్‌ అక్టివిటీస్‌, డ్రగ్స్‌ అడిక్షన్‌, షీటీమ్‌ సేవలు, ఇంటర్నెట్‌ దుష్పలితాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. తిమ్మాపూర్‌ సర్పంచ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు, జిల్లా వైద్యాధికారి కే లలితా దేవి, కరీంనగర్‌ రూరల్‌ సిడిపిఓ సబితాకుమారి, డిసిపిఓ శాంత, తహసీల్దార్‌, ఎంపిడిఓ, ఎంఈఓ, సర్పంచ్ నీలిమ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *