ఎన్ హెచ్ అధికారులు, కాంట్రాక్టర్లపై బండి సంజయ్ ఫైర్…

0

కమీషన్లు తీసుకున్నోళ్లే మీ దృష్టిలో మంచోళ్లా?
. పైసా తీసుకోకుండా ప్రజల కోసం నిధులు తీసుకొస్తే పట్టించుకోరా?
. సకాలంలో కేంద్రం నిధులిస్తున్నా పనుల్లో జాప్యం చేస్తారా?
. ఎన్ హెచ్ అధికారులు, కాంట్రాక్టర్లపై బండి సంజయ్ ఫైర్…
. మార్చిలోపు పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం

కరీంనగర్:
‘‘కేంద్ర ప్రభుత్వం కేంద్ర రహదారుల మౌలిక సదుపాయల నిధుల కింద (సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) తెలంగాణకు రూ.600 కోట్లు మంజూరు చేయిస్తే కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి ఒక్క కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికే రూ.219 కోట్లు తీసుకొచ్చి రహదారుల విస్తరణ పనులు చేయిస్తున్నా… కానీ ఏనాడూ మీరు కనీసం థ్యాంక్స్ చెప్పలే. ఒక్క బోకే కూడా ఇవ్వలే. మీ దృష్టిలో కమీషన్లు తీసుకునేటోళ్లే మంచోళ్లు. పైసా తీసుకోకుండా జనం కోసం కష్టపడే నాలోంటోళ్లంటే మీకు పట్టదు. బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోయినా పనులు చేస్తారు… కేంద్రం సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నా పనులు చేయరు. ఎందుకంటే పనులు పూర్తయితే కేంద్రానికి పేరొస్తుందనే అక్కసుతో బీఆర్ఎస్ నేతలు బెదిరిస్తే భయపడి పనులు చేయరు. ఇదేనా పద్దతి? ప్రజల కోసం ఇంత కష్టపడుతుంటే మీరు చూపే క్రుతజ్ఝత ఇదేనా?’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అధికారులు, కాంట్రాక్టర్లపై మండిపడ్డారు.
శుక్రవారం మధ్యాహ్నం హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఇందుర్తికి విచ్చేసిన బండి సంజయ్ కుమార్ ఇందుర్తి-సుందరగిరి, ఇందుర్తి-హుస్నాబాద్ పరిధిలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టిన ఇందుర్తి-సుందరగిరి పనుల్లో జరుగుతున్న జాప్యం ఆరా తీశారు. ఈ సందర్భంగా స్థానికులు పనుల తీరులో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆరోపించడంతో వెంటనే సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను పిలిచి పైవిధంగా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని స్పప్టం చేసిన బండి సంజయ్ కుమార్ వచ్చే మార్చి నెలాఖరులోగా రహదారి విస్తరణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం రూ.24 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇందుర్తి-హుస్నాబాద్ విస్తరణ పనులను పరిశీలించిన బండి సంజయ్ ఆయా పనులను సైతం నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాల్సిందేనని, జాప్యం చేస్తే సహించేది లేదని స్ఫష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *