మెడికల్ మాయా…

1

మెడి ” కిల్లర్స్ “
. నిబంధనలు పట్టని మందుల దుకాణాలు
. చెలామణిలో నకిలీ మందులు
. జిల్లాలో మెడికల్ సిండికేట్…
. ప్రజారోగ్యంతో చెలగాటం

కరీంనగర్:
మెడికల్ దుకాణాదారులు అమాయక ప్రజలను మోసం చేసేందుకు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ప్రిస్కిప్షన్‌ (మందుల చీటీ) లేకున్నా ఫర్వా లేదు.. డాక్టర్‌ సిఫార్సు జాన్తానై.. వారు చెప్పిందే వేదం.. చేసేదే శాసనం.. ఆ మందు.. ఈ మందు అనే తేడా లేదు.. ఇక్కడ అన్ని మందులు అమ్మబడును.. కిరాణ సామాన్లు కూడా..!, బ్రాండెడ్‌ పేరిట నెంబర్‌-2, షెడ్యూల్‌ – హెచ్‌ తో పాటు వయాగ్రా బిల్లల దాకా, అసలుతో పాటు నకిలీ మందులు రాజ్యమేలుతున్నాయి. ఎమ్మార్పీ వర్తించదు.. రసీదులు ఇవ్వరు.. ఇదీ మెడికల్‌ మాయాజాలం. ప్రజారోగ్యంతో చెల గాటమాడుతున్నా, ఔషధ నియంత్రణ శాఖ పట్టించుకోదు. మూడు నెలలకోసారి మాముళ్లు ముడుతున్నాయి కాబోలు, మెడికల్‌ షాపుల వైపు కన్నెత్తి చూస్తున్న దాఖలాలు లేవు. జిల్లాలోని మెడికల్‌షాపుల్లో దందా యథేచ్చగా సాగుతోంది. డాక్టర్లే తమ సొంత ఆస్పత్రులలో మెడికల్‌ షాపులు ఏర్పాటు చేసుకుని వారికి వచ్చే ‘ఫిజిషియన్‌ షాంపిల్స్‌’ ను షాపుల ద్వారా విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు.

జిల్లాలో 1162 మెడికల్‌ షాపులు…
జిల్లాలోని 16 మండలాల పరిధిలో సుమారు 1162 వరకు మెడికల్‌షాపులు ఉన్నాయి. అందులో 102 హోల్ సేల్ మెడికల్ దుకాణాలు ఉండగా మరో 268 ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాకుండా మరో 17 హోల్ సేల్ మరియు రిటైల్ మెడికల్ దుకాణాలు జిల్లాలో నడుస్తున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో 721 మెడికల్ రిటెల్ దుకాణాలు ఉన్నాయి. మెడికల్‌ షాపులు ఏర్పాటు చేయాలంటే పలు నియమ నిబంధనల ప్రకారం ఔషధ నియంత్రణ శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నియమ నిబంధనలను పెద్దగా పట్టించుకోకుండా లైసెన్స్‌లు ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్దఎత్తున అధికారులకు ముడుపులు చెల్లించి లైసెన్స్‌ పొందుతున్నారు. మెడికల్‌ షాపు పేరిట లైసెన్స్‌ పొంది మెడికల్‌ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌ నడుపుతున్నారు. మందులతో పాటు సబ్బులు, పాలు, పెరుగు, కొబ్బరిబోండాలు, పండ్లు, వాటర్‌బాటిల్స్‌ తదితర జనరల్‌ సామాన్లు కూడా విక్రయిస్తున్నారు.

దుకాణదారులే డాక్టర్లు…
మెడికల్ దుకాణదారులు డాక్టర్ల అవతారమెత్తి అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. ఈ దందా జిల్లాలో జోరుగా సాగుతోంది. రోగులకు డాక్టర్లు రాసిచ్చే ప్రిస్ర్కిప్షన్‌(చీటి) ఉంటేనే మెడికల్‌ షాపులలో మందులు ఇవ్వాల్సి ఉంది. ఎలాంటి చీటీ లేకున్నా ఏ మందు అడిగితే ఆ మందు ఇచ్చేస్తున్నారు. ఇచ్చే మందులకు ఎలాంటి బిల్లులు ఇవ్వడం లేదు. ఒకవేళ ఆ మందులు వాడిన రోగులకు మందు వికటిస్తే తాము అమ్మలేదని బుకాయించిన సంఘటనలు అనేకం ఉన్నాయి.

పేరొకరిది.. దుకాణం మరొకరిది…
మెడికల్‌ షాపు ఏర్పాటు చేయాలంటే ఫార్మసీ సర్టిఫికెట్‌ తప్పనిసరి. ఆ సర్టిఫికెట్‌ ఆధారంగానే అధికారులు లైసెన్స్‌ జారీ చేస్తారు. వైద్యం వ్యాపారంగా మారిన క్రమంలో కొంతమంది ఫార్మసీ చేసి ఉన్నత చదువులు చదివే వారికి సంబంధించిన ఫార్మసీ సర్టిఫికెట్లను అద్దె రూపేణా తీసుకుని లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. సర్టిఫికెట్‌లో ఉన్న పేరుతోనే లైసెన్స్‌ మంజూరవుతుంది. సదరు ఫార్మాసిస్టు షాపులో తప్పనిసరిగా ఉండి మందులు విక్రయించాల్సి ఉంటుంది. అవగాహన కూడా లేని వారితో మందులు విక్రయిస్తున్నారు.

మెడికల్ సిండికేట్…
జిల్లాలో మెడికల్ షాపుల యజమానులు సిండికేట్ గా ఏర్పడ్డారు. నాణ్యతా లోపంతో తయారు చేసిన వివిధ రకాల మందులను అమ్మే హోల్‌సేలర్లు అతితక్కువ ధరపై వీటిని రిటైలర్లకు సరఫరా చేస్తున్నారు. ఈ మందుల ధరలు వారికి అసలు ధర కంటే 70 శాతం నుంచి 50 శాతం వరకు తక్కువతో సరఫరా అవుతాయి. వీటిని బ్రాండెడ్‌ మందుల ధరతో రోగులకు అంటగడుతున్నారు. ఆ మందులనే డాక్టర్లు రాసేలా వారికి నజరానాలు అందిస్తున్నారు.

షెడ్యూల్‌-హెచ్‌పై నియంత్రణేది..?
మెడికల్‌ షాపులకు సరఫరా అయ్యే మందులలో కొన్ని ముఖ్యమైన మందులు ‘షెడ్యూల్‌-హెచ్‌’ హెచ్చరికలతో సరఫరా అవుతాయి. అలాంటి మందులను డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ ఉంటేనే విక్రయించాల్సి ఉంటుంది. ఈ మేరకు రిజిస్టర్‌ మెయింటెన్‌ చేస్తు కొనుగోలు చేసిన మందులు, విక్రయించిన మందులను ప్రతిరోజు రిజిష్టర్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ప్రత్యేక రిజిష్టర్లు మెయింటెన్‌ చేయడంలేదు. కొన్ని మెడికల్‌ షాపుల్లో రాత్రి షాపు మూసే ముందు కొన్నిమందులకు సంబంధించి బిల్లులు కట్‌ చేస్తూ నిబంధనల నుంచి తప్పించుకుంటున్నారు.

నామామాత్రంగా తనిఖీలు…
నిత్యం మెడికల్‌షాపులను తనిఖీలు చేయాల్సిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు, యేడాదికి ఒక్కసారి కూడా తనిఖీ చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రతీ మూడు నెలల కొకసారి, ఆరు నెలలకు, ఏడాదికి మామూళ్లు ఠంచన్‌గా అందుతుండడంతో చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అన్ని సక్రమంగా ఉంటే అధికారులకు మామూళ్లు ఎందుకు ఇస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

1 thought on “మెడికల్ మాయా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *