ఏడాదిగా బకాయిలు పెండింగ్.. రైతుల ఆగ్రహం

0

ఏడాదిగా బకాయిలు పెండింగ్..
– రైతుల ఆగ్రహం
– ఈగల్ సీడ్స్‌ కార్యాలయం ముట్టడి..
– పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌
హుజూరాబాద్‌ అక్టోబర్17:
పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి ఏడాది గడుస్తున్నా బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఈగల్‌ సీడ్స్‌ కంపెనీ హుజూరాబాద్‌ వరంగల్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని శనివారం బాధిత రైతులు ముట్టడించారు. కార్యాలయంలోని సిబ్బందిని నిలదీసి, తమకు రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ పరిసర ప్రాంతాలైన నేరేడుగొండ, కటాక్షపూర్‌ తదితర గ్రామాలకు చెందిన సుమారు 70 మంది రైతులతో 300 ఎకరాల్లో మొక్కజొన్న, వరి విత్తనోత్పత్తి సాగు చేయించారు. గత రబీ సీజన్‌లో పంట చేతికి వచ్చిన అనంతరం ఉత్పత్తులన్నింటినీ కంపెనీ సేకరించింది. అయితే, పంటను అప్పగించి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు తమకు రావాల్సిన బిల్లులు చెల్లించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
నాణ్యత పేరుతో చెల్లింపులు నిలిపివేత?
విత్తనాల శుద్ధి ప్రక్రియ, మొలకెత్తే సామర్థ్యంలో లోపాలు ఉన్నాయంటూ కంపెనీ యాజమాన్యం సాకులు చెబుతూ చెల్లింపులను నిలిపివేసిందని రైతులు ఆరోపించారు. పంట సాగు కోసం పెట్టుబడులు పెట్టి, దిగుబడులను కంపెనీకి అప్పగించినప్పటికీ డబ్బుల కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోయారు. లక్షలాది రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
త్వరలో బకాయిలు చెల్లిస్తామని హామీ..
బాధిత రైతులు కార్యాలయానికి చేరుకుని సిబ్బందిని నిలదీయడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సిబ్బంది కంపెనీ యాజమాన్యంతో రైతులకు ఫోన్‌లో మాట్లాడించారు. పెండింగ్‌ బకాయిలన్నింటినీ త్వరలోనే చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *