దివ్యాంగులు ఎంతో జ్ఞానవంతులు

0

దివ్యాంగుల పట్ల ప్రేమ చూపాలి
. జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ

కరీంనగర్:
దివ్యాంగులు వికసిస్తున్న పువ్వుల లాంటి వారని, ఎటువంటి కల్మషమూ లేని వారని, వారి పట్ల ప్రేమ, వాత్సల్యం చూపాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. వికలాంగుల పాఠశాలల్లో వారికి సేవలు అందిస్తున్న బోధన, శిక్షణ సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. దివ్యాంగులకు అపారమైన జ్ఞానం ఉంటుందన్నారు. దివ్యాంగుల కోసం గతంలో ఎటువంటి ఉపకరణాలు ఉండేవి కావని, కానీ ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానంతో అనేక సహాయ ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి మాట్లాడుతూ…దివ్యాంగులకు నిర్వహించిన ఆటలు, క్రీడల పోటీల్లో వారిలో ఉన్న ప్రతిభను గమనించానని, వారు ఒకరికొకరు సహకరించుకోవడం చూశానని తెలిపారు. మనసుతో చూస్తే ఎవరూ వికలాంగులు కాదన్నారు. ప్రపంచంలో ఎందరో దివ్యాంగులు ఎన్నో సాధించారని అందులో సైంటిస్టులు, కవులు ఉన్నారని అన్నారు. లూయిబ్రెయిలీ, హెలెన్‌ కెల్లర్‌, సూరదాస్‌ వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దివ్యాంగులకు ఎన్‌జిఓల సహకారంతో ఉపాధి అవకాశాలు పరిశీలిస్తామని, సదరం సర్టిఫికెట్ల కోసం మెడికల్‌ స్లాట్‌బుకింగ్‌లో తలెత్తే సమస్యలపై రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగుల నృత్యప్రదర్శనాలు, ఆలపించిన గేయాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ రంగాల్లో సేవలందించిన వికలాంగులను సత్కరించారు. ఆటలు, క్రీడల పోటీల్లో గెలుపొందిన వికలాంగులకు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి, డిఆర్‌డిఓ శ్రీలత, మెప్మా పిడి రవీందర్‌, డిఎంహెచ్‌ఓ లలితాదేవి, సిడబ్ల్యుసి చైర్‌పర్సన్‌ ధనలక్ష్మి, సిడిపిఓ సబిత, రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ కేశవరెడ్డి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత అంజనారెడ్డి, ప్రిన్సిపాల్‌ నర్మద, చీటి రామారావు, నాగలక్ష్మి, రోజా, పరమేశ్వర్‌, ఉమారాణి, దివ్యాంగుల సంక్షేమ సంఘాల బాధ్యులు కట్ట రవీందర్‌, జక్కం సంపత్‌, కైరి అంజయ్య, వెన్నం శ్రీనివాస్‌, కొలకాని నర్సయ్య, కొత్తూరి స్వామి, సాధు మునీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *