ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి

0

దేశంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన బిజెపి ప్రభుత్వం
. సౌత్ ఇండియా నిధులను నార్త్ ఇండియాకు తరలిస్తున్న మోడీ
. విభజన హామీలను అమలు చేయని కేంద్ర ప్రభుత్వం
. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లాతురుకు తరలింపు
. జన గణన గురించి మోడీ ఎందుకు మాట్లాడటం లేదు
. ధనవంతుల కంటే బలహీన వర్గాలు కట్టే టాక్సీ అధికం…
హుజురాబాద్:
కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం దేశంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యవేదిక చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ ఆరోపించారు. బుధవారం హుజరాబాద్ పట్టణంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ధనవంతులకు 30 శాతం టాక్స్ వేయాల్సి ఉండగా కేవలం 23 శాతమే వేస్తున్నారని పేర్కొన్నారు. అత్యధికంగా పేదవారిపైనే టాక్సీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై బీజేపీ ప్రభుత్వం భారాలు మోపుతున్నదన్నారు. మహిళలు ఎక్కువగా వినియోగించే వస్తువులపై జిఎస్టి వేయడం దారుణమన్నారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం కేవలం జీఎస్టీ ద్వారానే 25 లక్షల కోట్లు వసూలు చేస్తున్నదని తెలిపారు. ధనవంతులు కట్టే టాక్సీ పెరగడం లేదని, బిసి, ఎస్సి, ఎస్టి, వెనుకబడిన తరగతుల ప్రజలు 90 శాతం మంది జీఎస్టీ ని కడుతున్నారన్నారు. దేశంలో యూపీఏ ప్రభుత్వం పేద ప్రజలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. ఈ పథకాన్ని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. దేశంలోని విశ్వవిద్యాలయాలకు నిధులు ఇవ్వడం లేదని స్కాలర్షిప్లు, ఫెల్లోషిప్పులు ఇవ్వడం లేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం విద్యా వ్యవస్థ కోసం ఏం చేసిందని, నవోదయ లేదా కేంద్రీయ పాఠశాలలను ఏమైనా ప్రారంభించారా అని ప్రశ్నించారు.
ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం…
దేశంలో అత్యధికమైన నిరుద్యోగ సమస్య ఉందని, 30 లక్షల ఖాళీలు ఉన్నప్పటికీ ఎందుకు భర్తీ చేయడం లేదని అడిగారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ జనగణన చేస్తామంటున్న, జన గణన గురించి మోడీ ఎందుకు మాట్లాడడం లేదన్నారు. 1951 నుంచి చేస్తున్న జనాభా లెక్కలు బిజెపి ప్రభుత్వం మోడీ వచ్చాక ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. దేశంలో కులవృత్తులు, సామాజిక పరంగా ప్రజలు ఎలా ఉన్నారనే విషయాలు జనాభా లెక్కల ద్వారానే తెలుస్తుందన్నారు. జనాభా లెక్కలు ఎందుకు చేయడం లేదో ప్రజలకు మోడీ సమాధానం చెప్పాలన్నారు. ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించదని ప్రజలే వెతుక్కోవాలని బిజెపి చెప్పడం దుర్మార్గం అన్నారు. విభజన హామీలు ఎందుకు అమలు చేయలేదన్నారు. కాజీపేటలో ఏర్పాటు చేయాల్సిన రైల్వే కోస్ట్ ఫ్యాక్టరీని మహారాష్ట్రలోని లాతూర్ కు ఎందుకు తరలించాలని ప్రశ్నించారు. ప్రధాని మోడీ సౌత్ ఇండియా నిధులను నార్త్ ఇండియాకు తరలిస్తూ దక్షిణాది రాష్ట్రాలను నిర్వీర్యం చేస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏర్పడ్డ సుస్థిర ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని కోరారు. దేశంలో తిరోగమన విధానాలను అమలుపరుస్తున్న మోడీని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జెఏసి ఉపాధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్, నాయకులు డాక్టర్ చంద మల్లయ్య, డాక్టర్ నల్లాని శ్రీనివాస్, డాక్టర్ వంగ సుధాకర్ కాకతీయ విశ్వవిద్యాలయం జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *