రైతు ఆత్మహత్యలపై కమిషన్ వేయాలి

0

బిజెపికి దమ్ముంటే రైతు ఆత్మహత్యలపై కమిషన్ వేయాలి
హుజురాబాద్:
దేశంలో రెండు సార్లు అధికారంలో ఉన్న బిజెపికి దమ్ము ఉంటే… రైతు ఆత్మహత్యలపై కమిషన్ వేయాలని, వ్యవసాయ రంగానికి అన్యాయం చేసినందుకు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక, తెలంగాణ జాగో వేదిక నాయకులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళి అన్నారు. టిఎస్ డిఎఫ్ జాగో తెలంగాణ ఆధ్వర్యంలో చేపట్టిన ఓటర్ల చైతన్య బస్సు యాత్ర సోమవారం హుజూరాబాద్ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆకునూరు మురళి మాట్లాడుతూ… దేశంలో వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చి ఎందరో రైతుల ఆత్మహత్యలకు కారణమైన బిజెపి ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. వ్యవసాయ రంగానికి సేవలు చేసిన స్వామినాథన్ కు భారతరత్న ఇచ్చి ఆయన సిఫార్సులను పట్టించుకోకపోవడం బిజెపి ద్వంద నీతికి నిదర్శనమన్నారు. ఏడాదికి రెండు కోట్ల చొప్పున 20 కోట్ల ఉద్యోగాలు దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు ఇస్తామని నమ్మ బలికి బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. దేశభక్తి గల మన దేశ సైన్యం ఉన్నంతకాలం పాకిస్తాన్ లాంటి చిన్న దేశంతో మనకేలాంటి ప్రమాదం ఉండదని, దేశ సైనికుల సాహసాలను పార్టీ కోసం ఉపయోగించుకునే నీచ సంస్కృతి బిజెపిదని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ హక్కులను ప్రజాస్వామ్యాన్ని బహిరంగంగా అపహాస్యం చేస్తున్న బిజెపిని ఈ ఎన్నికల్లో ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఓడించాలన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ రాష్ట్రాలలో అల్లకల్లోలాలు సృష్టించి ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష ప్రభుత్వాలను అక్రమంగా పడగొట్టిన బిజెపి, నైతిక విలువల గురించి మాట్లాడడం దురదృష్టకరమన్నారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జాగో తెలంగాణ బాధ్యులు ప్రొఫెసర్ కే లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ పద్మజ షాహ, ఎన్నారై రాయదాస్, న్యాయవాది గడ్డం ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *