తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు

0

కీర్తి ప్రసన్నను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలి
. కలెక్టర్ ప్రావీణ్య
వరంగల్:
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వీర్ గాథా విజేత కాసాని కీర్తి ప్రసన్న మరియు గైడ్ టీచర్ కే మాధవి లను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రావీణ్య ఘనంగా సన్మానించారు. సన్మాన అభినందన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతమైన ఉప్పరపల్లి ఖ్యాతిని ఢిల్లీ దాకా తీసుకెళ్లి, విద్యార్థులకు కీర్తి ప్రసన్న స్ఫూర్తిగా నిలిచిందని ప్రశంసించారు. కోటి 37 లక్షల మంది విద్యార్థుల నుండి సూపర్ 100 విజేతగా నిలవడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. ఆత్మవిశ్వాసంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలలో రాణించాలని, తగిన విధంగా ప్రోత్సాహాన్ని అందిస్తామని తెలిపారు. కేంద్ర రక్షణ మరియు విద్యా మంత్రులచేత సన్మానం పొంది, రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థి తన ప్రతిభతో పాల్గొనడం, అందుకు గైడ్ టీచర్ మాధవి చొరవ చూపడం ప్రశంసనీయమన్నారు. పాఠశాల హెచ్ఎం జయ తోపాటు వీర్ గాథా నోడల్ ఆఫీసర్ డాక్టర్ కట్ల శ్రీనివాస్, జిల్లా రిసోర్స్ పర్సన్ పిన్నింటి బాలాజీ రావులను కలెక్టర్ అభినందించారు. ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ అధ్యక్షులు దేవునూరి ఆనంద్ ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదుగా కీర్తి ప్రసన్న, గైడ్ టీచర్ మాధవిలను సత్కరించారు. ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు వనం కిరణ్ కుమార్, పిన్నింటి బాలాజీ రావు పాల్గొన్నారు.
కార్యక్రమంలో వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, జిల్లా విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *