అనుభవాలే ఆస్తి.. ఆత్మీయతే ఆనందం!
అనుభవాలే ఆస్తి.. ఆత్మీయతే ఆనందం!
– వయసు అడ్డంకి కాదు.. ఉత్సాహమే ఆయుష్షుకు అసలైన బలం!
– హుజురాబాద్లో ఘనంగా సీనియర్ సిటిజన్ల ఆత్మీయ సమ్మేళనం
– 150 మంది వృద్ధులకు ఘన సన్మానం..
– జీవితానుభవాల పంచికతో స్ఫూర్తిదాయకంగా వేడుక
హుజురాబాద్:
వయసు పెరిగినా ఉత్సాహం తగ్గకూడదని, జీవితంలో ఎదురైన అనుభవాలను భావితరాలకు అందిస్తూ సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. వృద్ధాప్యం అనేది జీవితానికి ముగింపు కాదని, అనుభవాల సంపదతో మరింత ఆనందంగా గడపాల్సిన దశ అని పేర్కొన్నారు. ఈ సందేశంతో హుజురాబాద్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన ‘సీనియర్ సిటిజన్ల అనుభవాల ఆత్మీయ సమ్మేళనం’ అందరినీ ఆకట్టుకుంది. హుజురాబాద్ క్లబ్లో స్థానిక మార్నింగ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో, పట్టణ కౌన్సిలర్, పర్యావరణవేత్త వర్ధినేని రవీందర్రావు సౌజన్యంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. హుజురాబాద్లో నివసిస్తున్న వారితో పాటు ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన 70 ఏళ్లు పైబడిన సుమారు 150 మంది సీనియర్ సిటిజన్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఆత్మీయంగా సత్కరించారు. శాలువాలతో ఘనంగా సన్మానించి వారి జీవితానుభవాలకు గౌరవం కల్పించారు.
ఒంటరితనం వృద్ధాప్యానికి శాపం…
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ఆస్తిపాస్తులు, పిల్లలు, కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ వృద్ధాప్యంలో ఒంటరిగా జీవించాల్సి రావడం బాధాకరమన్నారు. వృద్ధులను కుటుంబ సభ్యులు ఆప్యాయంగా చూసుకోవాలని, మనవళ్లు, మనవరాళ్లతో కలిసి సమయం గడిపేలా ప్రోత్సహించాలని సూచించారు. కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలు, ఆత్మీయ పలకరింపులే వృద్ధులకు మానసిక ప్రశాంతతను, ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. జీవితంలో సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి వెచ్చిస్తూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనుభవాలే భావితరాలకు మార్గదర్శకం…
సమ్మేళనంలో పలువురు సీనియర్ సిటిజన్లు తమ జీవిత ప్రయాణంలోని మధుర జ్ఞాపకాలు, సమాజం కోసం చేసిన సేవలు, ఎదుర్కొన్న ఒడిదుడుకులు, కష్టకాలంలో అధిగమించిన సవాళ్లను వివరించారు. జీవితంలో విజయాలు సాధించేందుకు అనుసరించిన పద్ధతులు, విలువలు, అనుభవాలను సభికులతో పంచుకున్నారు. వారి మాటలు యువతకు, భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా సాగాయి. తమ అనుభవాలకు గుర్తింపునిస్తూ, ఆత్మీయంగా ఒకచోట చేర్చి సత్కరించిన నిర్వాహకులకు వృద్ధులు కృతజ్ఞతలు తెలిపారు.
అండగా ఉంటాం.. మార్నింగ్ ఫ్రెండ్స్ భరోసా…
సీనియర్ సిటిజన్లకు ఎలాంటి సమస్యలు ఎదురైనా మార్నింగ్ ఫ్రెండ్స్ బృందం అండగా ఉంటుందని నిర్వాహకులు భరోసా ఇచ్చారు. అవసరమైన సమయంలో గ్రూపు సభ్యులను సంప్రదించాలని, వృద్ధుల సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పలకల ఈశ్వర్రెడ్డి, వేల్పుల రత్నం, ఆవునూరు సమ్మయ్య, ముక్కెర రాజు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, సర్పంచ్ కట్కూరి మల్లారెడ్డి, బెదరకోట జనార్దన్, చిరంశెట్టి వీరయ్య, మార్త రవీందర్, బత్తుల సమ్మయ్య, మామిడిపల్లి సాయి, పట్టణ ప్రముఖులు, మార్నింగ్ ఫ్రెండ్స్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
