మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో హుస్నాబాద్ రైతులకు దసరా కానుక
హుస్నాబాద్ రైతులకు దసరా కానుక
• ఇందిరమ్మ వరద కాలువ పనులకు రూ.251.95 కోట్లతో అనుమతులు
• మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో కీలక నిర్ణయం
• 38 వంతెనల నిర్మాణం.. 22 గ్రామాల్లో 24,398 ఎకరాలకు ప్రయోజనం
• ఏడాదిలోపు పెండింగ్ పనులు పూర్తి చేయాలని లక్ష్యం
హైదరాబాద్, అక్టోబర్ 19:
హుస్నాబాద్ నియోజకవర్గ రైతులకు సాగునీటి సౌకర్యాలు మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పీ) పరిధిలోని ఇందిరమ్మ వరద కాలువ ప్యాకేజీ-3 పనులకు రూ.211.172 కోట్లతో పరిపాలనా ఆమోదం మంజూరు చేయడంతో పాటు, ప్రధాన కాలువల్లో సీసీ లైనింగ్, అదనపు నిర్మాణాల కోసం మరో రూ.40.779 కోట్లతో కొత్త టెండర్లు పిలిచేందుకు అనుమతిచ్చింది. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో రైతులకు ఈ ప్రయోజనం చేకూరనుందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం అక్టోబర్ 19న జీవో నంబర్ 518 జారీ చేసింది. కాలువల పటిష్టత పెంచడం, సాగునీటి సరఫరాను మెరుగుపరచడం, పెండింగ్ పనులను పూర్తి చేయడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
38 వంతెనల నిర్మాణం…
హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో కుడి ప్రధాన కాలువ పరిధిలో మొత్తం 38 వంతెనలు నిర్మించనున్నారు. ఈ పనులు పూర్తయితే 22 గ్రామాలకు చెందిన రైతులకు, 24,398 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరనుంది. చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి, ముదిమాణిక్యం, రామంచ, సీతారాంపూర్, రేకొండ, బొమ్మనపల్లి, పీచుపల్లి, చిన్న ముల్కనూర్ గ్రామాల్లో 19 వంతెనలు నిర్మించనున్నారు. ఈ పరిధిలో 5,620 ఎకరాల ఆయకట్టు ఉంది. సైదాపూర్ మండలంలోని దూదేనపల్లి, ఆకునూర్, పేర్కపల్లి, వెంకటేశ్వరపల్లి, ఘన్‌పూర్, బొమ్మకల్, అమ్మనగుర్తి, ఏక్లాస్‌పూర్, ఎలబోతారం, గొడిశాల, రాయికల్, సైదాపూర్, సోమారం, వెన్నంపల్లి గ్రామాల్లో మరో 19 వంతెనలు నిర్మించనున్నారు. ఈ ప్రాంతంలో 18,778 ఎకరాల ఆయకట్టు ఉంది.
కాలువల పటిష్టతకు ప్రత్యేక పనులు…
ఎడమ, కుడి ప్రధాన కాలువల్లోని సున్నితమైన ప్రాంతాల్లో సీసీ లైనింగ్, అదనపు నిర్మాణాల కోసం రూ.40.779 కోట్లతో కొత్త టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ పనులతో కాలువల పటిష్టత పెరగడంతో పాటు నీటి వృథా తగ్గి, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టణీకరణ విస్తరణ, గ్రానైట్ క్వారీల ఏర్పాటు వంటి మార్పులను పరిగణనలోకి తీసుకుని ప్యాకేజీ పరిధిలో 9,125 ఎకరాల ఆయకట్టును తొలగించినట్లు, ఒప్పంద విలువను రూ.8.83 కోట్లు తగ్గించినట్లు తెలిపారు. పనులకు సాంకేతిక అనుమతులు ఇచ్చే ముందు నేల వర్గీకరణ, నమూనాలు, చిత్రపటాల పరిశీలనతో పాటు నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియను కరీంనగర్ ఇంజనీర్-ఇన్-చీఫ్ పర్యవేక్షించనున్నారు.
ఏడాదిలోపు పనులు పూర్తి చేయడమే లక్ష్యం…
హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ పనులను ఏడాదిలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. రైతాంగ సంక్షేమం, సాగునీటి రంగ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ఈ అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. 
