జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై విచారణ జరపాలి
జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై విచారణ జరపాలి
– గంభీరావుపేట ఎస్ఐ, సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలి
– టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు డిమాండ్
కరీంనగర్:
పత్రికలో వార్తా కథనాలు ప్రచురించిన జర్నలిస్టులను అదుపులోకి తీసుకుని థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) కరీంనగర్ జిల్లా కార్యదర్శి, తెలంగాణ మీడియం స్మాల్ డైలీ అండ్ పీరియాడికల్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కుడుతాడి బాపురావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు గాదె కరుణాకర్రావు డిమాండ్ చేశారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టులు సంపత్, ఎడిటర్ శేఖర్లను శుక్రవారం పరామర్శించి, ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాపురావు మాట్లాడుతూ.. గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ వ్యవహారశైలిపై వరుస కథనాలు ప్రచురించినందుకు జర్నలిస్టులపై ప్రతీకార చర్యలకు పాల్పడడం దుర్మార్గమన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులపై దాడులకు పాల్పడటం, పోలీసుల అదుపులో చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలు రావడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఈ ఘటనపై సిరిసిల్ల జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు.
స్వతంత్ర విచారణకు డిమాండ్…
పోలీసుల అదుపులో ఉన్న సమయంలో మొబైల్ ఫోన్లు తీసుకోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఆలస్యంగా అందిందని బాధితులు పేర్కొన్నారన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎక్కడెక్కడ దాడులు జరిగాయి? ఎవరు బాధ్యులు? ఎవరి ఆదేశాలతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి? అనే అంశాలపై స్వతంత్రంగా విచారణ జరపాలని బాపురావు, గాదె కరుణాకర్రావు డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలో ఇలాంటి ఆరోపణలకు తావుండకూడదని, గంభీరావుపేట ఎస్ఐతో పాటు బాధ్యులైన పోలీసులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత జర్నలిస్టులకు న్యాయం జరిగేలా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. లేనియెడల జర్నలిస్టులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు నరేష్, శంకర్, సురేష్ తదితరులు ఉన్నారు.
