రైతులను ఆదుకోవాలి: కొండల్ రెడ్డి

0

​రైతులను ఆదుకోవాలి..!

పంట చివరి దశలో సాగునీరు, నిరంతర విద్యుత్ అందించాలి
ఎల్‌ఎండీలో 15 టీఎంసీల నీరున్నా ఎందుకివ్వట్లేదు?
సింగిల్‌ విండో అధ్యక్షుడు కొండల్‌రెడ్డి విజ్ఞప్తి
​హుజూరాబాద్, అక్టోబర్17:
ఆరుగాలం శ్రమించి, అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన రైతన్నలను పంట చేతికొచ్చే కీలక సమయంలో సాగునీరు, విద్యుత్‌ కొరత తీవ్రంగా వేధిస్తోందని సింగిల్‌ విండో అధ్యక్షుడు కొండల్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “దండం పెట్టి వేడుకుంటున్నా.. రైతులను ఆదుకోండి ప్రభూ!” అంటూ హుజూరాబాద్ నియోజకవర్గ రైతుల తరఫున ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తక్షణమే చివరి తడులకు సాగునీరు విడుదల చేయడంతో పాటు వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. రేయింబవళ్లు కష్టపడి పంటలను కాపాడుకుంటూ వచ్చిన రైతులకు ప్రస్తుత పరిస్థితి ఆందోళన కలిగిస్తోందన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చుల కోసం రైతులు భారీగా అప్పులు చేశారని, సరిగ్గా గింజ పాలుపోసుకునే చివరి దశలో నీరు అందకపోతే దిగుబడులు పూర్తిగా దెబ్బతిని పెట్టుబడులన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెరిగిన సాగు వ్యయంతో అల్లాడుతున్న అన్నదాతలపై నీటి సమస్య పెనుభారంగా మారిందన్నారు.

​ఎల్‌ఎండీలో నీళ్లున్నా ఎందుకీ నిర్లక్ష్యం?
కరీంనగర్‌ దిగువ మానేరు జలాశయం (ఎల్‌ఎండీ)లో ప్రస్తుతం 15 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నప్పటికీ, రైతులకు సాగు నీరు విడుదల చేయకపోవడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. జలాశయంలో సమృద్ధిగా నీరు అందుబాటులో ఉన్న పరిస్థితుల్లో అధికారులు నిర్లక్ష్యం వీడి తక్షణమే స్పందించాలన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించి, హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని ఆయకట్టుకు వెంటనే నీటిని విడుదల చేసేలా పక్కా కార్యాచరణ రూపొందించాలని కోరారు. సాగునీటి సమస్యకు తోడు అప్రకటిత విద్యుత్‌ కోతలు రైతులను మరింత కుంగదీస్తున్నాయని కొండల్‌రెడ్డి మండిపడ్డారు. భూగర్భ జలాలు లేదా బోర్లలో నీరు ఉన్నా.. కరెంట్‌ కోతల వల్ల మోటార్లు నడవక పొలాలు ఎండిపోయే దుస్థితి నెలకొందన్నారు. నిరంతర నాణ్యమైన త్రీఫేజ్ విద్యుత్‌ అందించేలా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయంపైనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉందని, రైతు నష్టపోతే పల్లెలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతాయని హెచ్చరించారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గుర్తుచేస్తూ.. ప్రభుత్వం వెంటనే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, పంటలు ఎండిపోకుండా యుద్ధప్రాతిపదికన సాగునీరు, కరెంట్ సరఫరా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *