హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స
హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స
– మహిళ కడుపులోని నాలుగు కిలోల కణితిని తొలగింపు
హుజూరాబాద్:
హుజూరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి జిల్లా అధికారుల ప్రశంసలు అందుకున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా అత్యాధునిక వైద్య సేవలను అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు హుజురాబాద్ ఆసుపత్రి వైద్యులు. భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రేణిగుంట్ల కొమరమ్మ కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆమెకు అవసరమైన వైద్య పరీక్షలు, స్కానింగ్ నిర్వహించగా కడుపులో భారీ కణితి ఉన్నట్లు గుర్తించారు. ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్యుల బృందం శస్త్రచికిత్స నిర్వహించి సుమారు నాలుగు కిలోల భారీ కణితిని తొలగించారు. ప్రస్తుతం కొమరమ్మ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కడుపునొప్పి, అసాధారణ వాపు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తిస్తే చికిత్స సులభంగా జరుగుతుందని తెలిపారు. ఈ అరుదైన శస్త్రచికిత్స విజయవంతం కావడంతో రోగి కుటుంబ సభ్యులు వైద్యుల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇలాంటి క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా జరగడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి కి అభినందనల వెల్లువ…
అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించిన ఆర్ఎంఓ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డిని డి సి హెచ్ కృష్ణ ప్రసాద్ ఆసుపత్రి సూపరింటెండెంట్ జీ రవీందర్ లు అభినందించారు.

