కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది

0

కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది
– మున్సిపల్ మాజీ చైర్మన్ గందే రాధిక-శ్రీనివాస్
– హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు
హుజురాబాద్:
హిందూ సంప్రదాయంలో ప్రతి మాసానికీ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుందని, కానీ కార్తీక మాసం అత్యంత పవిత్రమైనదని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ అన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం స్థానిక పాటి మీద ఆంజనేయస్వామి సహిత సరస్వతీ మాత ఆలయంలో ప్రత్యేక పూజలు, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఈ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి తిథి అత్యంత శుభప్రదమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయన్నారు. ఈ రోజు శివుడు త్రిపురాసురులను సంహరించిన రోజు కావడంతో దీన్ని త్రిపురారి పౌర్ణమి అని కూడా పిలుస్తారని తెలిపారు. ఈ రోజు దీపారాధన, వ్రతాలు, దానాలు చేస్తే పాపాలు నశించి, అనేక శుభాలు కలుగుతాయని విశ్వాసం ఉందన్నారు. కార్తీక మాసం శివుడి, విష్ణువు ఇద్దరికీ ప్రీతిపాత్రమైనదన్నారు. ఈ మాసం చివరి రోజైన పౌర్ణమి రోజు భక్తులు శివాలయాలకు, విష్ణుమందిరాలకు చేరి పూజలు, దీపారాధన చేస్తారన్నారు. ఈ రోజున చేసిన పూజలు, వ్రతాలు సంవత్సరం పొడవునా చేసిన పూజల ఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయని గుర్తుచేశారు. కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేకంగా 365 వత్తులతో దీపారాధన చేయాలన్నారు. ఈ వత్తులు సంవత్సరంలోనే 365 రోజులకు ప్రతీక అన్నారు. ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల అపారమైన శుభాన్ని ఇస్తుందని తెలిపారు. కార్తీక పౌర్ణమి రోజున చేసే పూజలు దానధర్మాలు అంతులేని ఫలితాలని స్థాయి అన్నారు. ఈ కార్యక్రమంలో పూజారులు తిరుమల్, లలిత్, ప్రదీప్, ఆలయ చైర్మన్ గందె శ్రీనివాస్, పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షులు సుద్దాల హరిశంకర్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *