యూరియా కొనుగోలు చేయని రైతులకే ప్రాధాన్యత..
యూరియా కొనుగోలు చేయని రైతులకే ప్రాధాన్యత..
– వ్యవసాయ సహాయ సంచాలకులు జి సునీత
– ఇప్పటివరకు కొనుగోలు చేసిన రైతుల వివరాలు సేకరణ
హుజురాబాద్:
గతంలో యూరియా కొనుగోలు చేయని రైతులకే మొదటి ప్రాధాన్యతో యూరియా ఇవ్వడం జరుగుతుందని హుజురాబాద్ సహాయ వ్యవసాయ సంచాలకులు జి సునీత తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య నిరంతర సంప్రదింపులు జరుగుతున్నందున హుజురాబాద్ డివిజన్ లోనీ అన్ని మండలాలకు త్వరలోనే తగినంత యూరియా ను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే యూరియా కొనుగోలు చేసిన రైతులు మళ్ళీ కొనుగోలు చేయడానికి రావద్దని కోరారు. ఇప్పటివరకు యూరియా తీసుకోని రైతులకు మాత్రమే వచ్చే యూరియా బస్తాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. దీని కొరకు ఇప్పటి వరకు ఏ రైతులు యూరియా బస్తాలను కొనుగోలు చేశారు. ఎక్కడ కొనుగోలు చేశారో.. ఎన్ని బస్తాలను కొనుగోలు చేశారో..అన్న పూర్తి వివరాలను సేకరించడం జరిగిందన్నారు. రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం వారికి వ్యవసాయ శాఖ వారికి సహకరించాలని కోరారు.
