నారాయణపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తాం..

0

నారాయణపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తాం..
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కరీంనగర్:
త్వరలోనే నారాయణపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పథకాల అమలుకు గ్రామసభల నిర్వహణలో భాగంగా గంగాధర మండలం నారాయణపూర్ లో బుధవారం ఏర్పాటు చేసిన గ్రామ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి హాజరయ్యారు. నారాయణపూర్ రిజర్వాయర్ ను సందర్శించారు. అనంతరం గ్రామసభలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి తక్కువ ఆయకట్టుకు నీరిచ్చిందని అన్నారు. ఈ ప్రభుత్వం తక్కువ ఖర్చులో ఎక్కువ ఆయకట్టుకు నీరు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నదని తెలిపారు. అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రాజెక్టుల జాబితాలో నారాయణపూర్ రిజర్వాయర్ ను చేరుస్తామని తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అవసరమైన సుమారు 70 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రకటించారు. ఏడాదిలోగా ప్రాజెక్టు పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీళ్లు అందిస్తుందన్నారు. రిజర్వాయర్ ముంపు విషయంలో నారాయణపూర్ ప్రజలకు న్యాయం చేస్తామని తెలిపారు. నారాయణపూర్ లో నాలుగు ప్రభుత్వ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం వర్తించేలా చూస్తామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగును నింపేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని వివరించారు.
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…10 సంవత్సరాలుగా రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారందరికీ కార్డు అందుతుందని తెలిపారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని, ఈనెల 26న మరో నాలుగు పథకాలకు శ్రీకారం చుట్టామని వివరించారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు.
జనవరిలోనే ఎల్లంపల్లి జలాలు విడుదల…
గతంలో ఎప్పుడూ లేనివిధంగా జనవరి మాసంలోనే నారాయణపూర్ జలాశయానికి ఎల్లంపల్లి నీరును విడుదల చేశామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మెట్ట ప్రాంతంగా ఉన్న చొప్పదండి నియోజకవర్గంలో జల యజ్ఞంలో భాగంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నారాయణపూర్ జలాశయానికి శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. 90 శాతం పనులు కూడా పూర్తి చేసిందని అన్నారు.
మిగిలిన 10 శాతం పనులను గత సర్కారు పట్టించుకోలేదని అన్నారు. నారాయణపూర్ జలాశయం పనులన్నీ పూర్తి చేస్తామని, మిగిలిన ఆయకట్టుకు కూడా నిరందిస్తామని వివరించారు. ప్రభుత్వ పథకాల కోసం ప్రజలు గతంలో సమర్పించిన దరఖాస్తులన్నీ పరిగణలోకి తీసుకున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. అర్హులుగా ఉన్న వారి పేరు గ్రామసభలో లేకపోతే అక్కడే దరఖాస్తు సమర్పించాలని తెలిపారు. చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రేషన్ కార్డుల ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీ కిరణ్, ప్రపుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, జడ్పీ సీఈవో శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *