సహజ వనరులను పొదుపుగా వాడుకోవాలి

1

కర్బన వినియోగ ఉద్గారాలు తగ్గిస్తేనే వాతావరణంలో మార్పులు తగ్గుతాయి
. లేదంటే పర్యావరణ అసమతుల్యత తో జీవ మనుగడ అసాధ్యమే…
. అవసరానికి మించి సహజవనరుల వాడకమే వాతావరణ మార్పులకు కారణం
హైదరాబాద్:
మానవ జీవన పరిణామ క్రమంలో అనవసర సహజవనరుల వినియోగం పెరుగుతోంది. అభివృద్ధి ముసుగులో, నవీన జీవన శైలి అని అవసరానికి మించి, ప్రకతి నియమాలకు విరుద్ధంగా సహజ వనరులను దోపిడీ చేస్తూ వినియోగిస్తున్నాడు. స్వార్ధంతో తమ ఆవాసంలోని సహజ వనరులను అవసరానికిమించి వాడుతూ తామేకాక తమయొక్క రాబోవు తరాలకోసం ఇప్పుడే ఒకేసారి సహజ వనరులను డబ్బు రూపంలోకి మార్చి విలాసవంతమైన జీవితాన్ని జీవించాలని, అదేజీవితాన్ని తమ వారసులు జీవించాలనే తప్పుడు ఆలోచనతో, తప్పుడు దారిలో వెళుతూ రాబోవుతారాలకు తాను మేలుచేస్తున్నానే భ్రమలో తను చేస్తున్న విధ్వంసాన్ని మర్చిపోతున్నాడు.
ఈ స్వార్ధపు మానవ తప్పుడు ఆలోచలే వాతావరణ మార్పులకు ముఖ్య కారణమవుతున్నాయి. ఇది అందరు గమనించకపోతే మానవ జీవణంతోపాటుగా జీవ ఆవాసాలు నిర్వీర్యమై ఎడారులుగా మారానున్నాయి. ఈ విపత్కర పరిణామాన్ని ముందే పసిగట్టి, ప్రమాదాన్ని గ్రహించి, వాతావరణంలో వచ్చే మార్పులు అవలోకణం చేసుకొని తమ జీవనాన్ని మరియు రాబోవుతారాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే, తక్షణమే జాగ్రత్తలు తీసుకొని తమ జీవనాన్ని ప్రకృతి సహేతుక జీవనంగా మార్చుకొని సహజసిద్ధంగా జీవించడానికి ఉపకరించాలి. వాతావరణం మార్పులు జరుగకుండా అందుకు మనమేంచెయ్యాలో శాస్త్రియంగా మన జీవనశైలిని మార్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

వాతావరణాన్ని కాపాడేందుకు మన వంతు బాధ్యతగా చేయాల్సిన పనులు..
వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రపంచ నాయకత్వం *అంతర్జాతీయ స్థాయిలో కార్యాచరణ* చేపట్టాల్సి ఉంది. అదే సమయంలో వ్యక్తులుగా మనమందరం *ఉద్గారాల నియంత్రణ*కు మన వంతు కృషి చేయాలి. వ్యక్తిగత స్థాయిలో పర్యావరణంపై దుష్ప్రభావాన్ని నివారించేందుకు మనం చేయాల్సిన కొన్ని పనులు.

ఇంటి ఉష్ణోగ్రతలను సులభ పద్ధతుల్లో అదుపు చేయడం…
హీటర్లు అమర్చుకోవడం దగ్గర నుంచి ఇంట్లో చేసుకునే అనేక మార్పులు భూమికి మేలు చేస్తాయి. గ్యాస్ లేదా ఆయిల్‌తో పనిచేసే హీటర్లకు బదులు విద్యుత్‌తో పనిచేసే హీట్ పంప్‌లు వాడడం మంచిది. అవసరం లేనప్పుడు లైట్లు, గృహోపకరణాలను స్విచ్ ఆఫ్ చేయడం, నీటిని పొదుపుగా వాడడం లాంటి పర్యావరణ హిత కార్యాల వల్ల వాతావరణ మార్పులపై పడే ప్రభావం తగ్గడమే కాకుండా డబ్బుకూడా ఆదా అవుతుంది. ఇళ్లలో గోడలు, పైకప్పు, కిటికీలు వంటివి ఉష్ణ నిరోధకంగా మార్చుకోవచ్చు. విద్యుత్/ఇంధన వినియోగం తగ్గించడానికి చౌకైన మార్గం డ్రాట్ ప్రూఫింగ్ (శీతల దేశాల్లో బయట చల్లదనం ఇంట్లోకి రాకుండా చేసుకునే విధానం). గోడల్లో చిన్నచిన్న పగుళ్లు లేకుండా చూడడం.. కిటికీలు, తలుపుల చుట్టూ ఉన్న ఖాళీలలోంచి బయటి చల్లగాలి లోనికి వచ్చి లోపలి వేడి గాలి బయటకు పోయే అవకాశాన్ని తగ్గిస్తే ఇంటిని వెచ్చగా మార్చుకోవడానికి విద్యుత్ వాడాల్సిన అవసరం తగ్గుతుంది.

ఆహార వృథాను, పశుమాంస వినియోగాన్ని తగ్గించడం…
గ్రీన్ హౌస్ ఉద్గారాలలో 14 శాతం పెంపుడు పశుపక్ష్యాదుల కారణంగా వెలువడుతున్నాయి. ఇందులో పశుసంపద పాత్ర మరీ అధికం. దీన్ని తగ్గించాలంటే మన ఆహారంలో పాడి ఉత్పత్తులు, గొర్రెలు, మేకలు, ఆవులు, ఎద్దులు వంటి వాటి మాంసాన్ని వినియోగించడం మానేయాలి. ఏ ఆహార పదార్థం కార్బన్ ఫుట్‌ప్రింట్ గమనించినా.. అది ఎలా ఉత్పత్తవుతుంది, అది ఎక్కడి నుంచి వస్తుందనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో ఉత్పత్తువుతున్న ఆహారంలో 25 నుంచి 30 శాతం వృథా అవుతున్నట్లు ‘వేస్ట్ అండ్ రిసోర్స్ యాక్షన్ ప్రోగ్రాం’ అధ్యయనాలు చెబుతున్నాయి.

కార్ల వాడకం వీలైనంతగా మానేయాలి. విమాన ప్రయాణాలు తగ్గించుకోవాలి…
ప్రపంచ కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలలో 25 శాతం రవాణా వల్ల వెలువడుతున్నవే. కార్లు వాడడం మానేస్తే రవాణా వల్ల వెలువడే కార్బన్ డైఆక్సైడ్ శాతం తగ్గిపోతుంది. సామూహిక వాహన ప్రయాణాలను పెంచుకోవడం చేయాలి. అయితే, సరైన ప్రజా రవాణా సదుపాయాలు లేని ప్రాంతాల్లో ఉండేవారు, రాత్రి షిఫ్టులలో పనిచేసేవారు కార్ల వాడకం మానేయడం కుదరకపోవచ్చు. పునరుత్పదాకా శక్తి వనరుల (రెన్యూవబుల్ ఎనర్జీ) (Solar Energy, Wind Energy & Hydrogen Energy etc.) తో నడిచే వాహనాలను విధిగా వాడుకోవాలి.
చిన్నచిన్న పనులే పెద్ద ప్రభావం చూపిస్తాయి. మన ఇంటికి దగ్గర్లోని దుకాణాలకు నడుచుకుంటూ వెళ్లడం, సైకిళ్లపై వెళ్లడం వంటివి పర్యావరణానికి మేలు చేస్తాయి. స్నేహితులు, ఇరుగుపొరుగువారితో కార్లు షేర్ చేసుకోవడం వంటివీ వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో ఎంతో ఉపకరిస్తాయి. ఎలక్ట్రిక్ కార్ల వాడకం పెరుగుతోంది. అయితే, ఇప్పటికీ వాటి ధరలు ఎక్కువగానే ఉండడంతో అందరూ వాటి వైపు మొగ్గు చూపడం లేదు. అయితే, ఎలక్ట్రిక్ కార్లను చార్జింగ్ చేయడానికి ఉపయోగించే విద్యుత్ కూడా సౌర విద్యుత్, పవన విద్యుత్ అయినప్పుడే మన ప్రయాణాన్ని అసలైన గ్రీన్ ట్రావెల్‌గా చెప్పుకోవచ్చు. అయితే, వ్యక్తిగతంగా ఎంత చేసినా తరచూ దూర ప్రయాణాలు చేసేవారు విమానం ఎక్కుతున్నారు. ఒక వ్యక్తి ప్రయాణం కారణంగా కిలోమీటరుకు సగటు ఉద్గారాలను లెక్కించి అందుకు కారణాలు విశ్లేషిస్తే దేశీయ విమాన సర్వీసులే అందుకు ప్రధాన కారణమవుతున్నాయి. దేశీయ ప్రయాణాలకు విమానాలకు బదులు రైళ్లను (Mass Transportation) ఎంచుకుంటే పర్యావరణంపై ప్రభావాన్ని అయిదో వంతు మేర తగ్గించొచ్చు.

ఏదైనా కొనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి…
యూఎన్ ఎన్విరానమెంట్ ప్రోగ్రాం అంచనాల ప్రకారం… ఒక జీన్స్ ప్యాంట్ తయారీకి 3,781 లీటర్ల నీరు ఖర్చవుతుంది. పత్తి పంట కోసం అవసరమయ్యే నీరు, దుస్తుల తయారీ సమయంలో వాడే నీరు, రవాణా, ఉతకడానికి అవసరమయ్యే నీరు అన్నిటినీ లెక్కేసి సగటున రూపొందించిన అంచనా ఇది. తరచూ కొత్త దుస్తులు కొనే బదులు పాతవి బాగుచేసుకుని వాడుకోవడం మంచిది. పాత దుస్తులు కూడా పడేయకుండా అవసరమైనవారికి ఇవ్వడం మంచిది. ఫ్యాషన్ ఇండస్ట్రీలో వ్యర్థాలను నియంత్రించే లక్ష్యంతో చాలా సంస్థలు దుస్తులు అద్దెకు ఇస్తున్నాయి. ప్రతిసారీ కొత్త దుస్తులే కొనకుండా పాతవీ కొని చూడండి. గృహోపకరణాలు సరైనవి ఎంచుకోవడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది. అత్యధిక ఇంధన దక్షత ఉన్న వస్తువులే వీలైనంత వరకు కొనాలి.

మానవులచే వస్తు తయారీ సమయంలో లేదా పని వల్ల ఉత్పాధిత వ్యర్ధాలను శాస్త్రియంగా యాజమాన్య వినియోగ సర్దుబాటు చెయ్యడం…
మానవ ఉపయోగిత వ్యర్థలను (ముఖ్యంగా మునిసిపల్ సాలిడ్ వేస్ట్ మరియూ వ్యవసాయ ఉత్పాధిత వ్యర్ధాలను (అగ్రికల్చర్ రెసిడ్యూస్)) కాల్చకుండా, వాటిని టెక్నాలజీ ద్వారా (3’R ) తిరిగి వాడుకోవడం, కంపోస్టు ఎరువుగా మార్చుకోవడం వంటివి చెయ్యాలి. ప్రతీ పట్టణ ఆవాసాలలో విధిగా గ్రీన్ బెల్ట్ లు గ్రీన్ ఆక్టివిటీస్ ప్రజల సహకారంతో, నిధులు కేటాయించి ప్రభుత్వాలు ఏర్పాటుచేసేలా చెయ్యడం. హరిత స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో పర్యావరణ హిత కార్యక్రమాలు చేయడం. అదే క్రమంలో డెఫారెస్టేషన్ ఆపడం, రీఫారెస్టేషన్, ఆఫరెస్టేషన్ లను ప్రోత్సహించి మనవంతుగా భూ మండలాన్ని కాపాడుకోవడమే ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం. పర్యావరణ హితంగా జీవనాన్ని గడపడం అలవాటు చేసుకోవడమే మనముందున్న తప్పని అవసరం. లేదంటే మన మనుగడతోపాటు మనచుట్టూ ఉన్న సజీవ, నిర్జీవ అనుఘటకాలకు మనుగడపై ఎంతో ప్రమాదం పొంచి ఉంది. ప్రకృతి రక్షితి రక్షితః.
రవిబాబు పిట్టల, పర్యావరణవేత్త, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ & యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ సొసైటీ, వరంగల్, తెలంగాణ, ఇండియా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *