బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

0

బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి
– కాంగ్రెస్ పాలనలో కేసులే తప్ప ఫలితం శూన్యం
– హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్/జమ్మికుంట:
బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేసులు వేయడమే పాలనగా కొనసాగుతోందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. శనివారం జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జమ్మికుంట పట్టణంలోని 9, 10, 11, 16, 17, 18, 19, 20,29, 4, 5 వార్డులతో పాటు హుజురాబాద్ పట్టణంలోని 8, 9 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు దిశా నిర్దేశం చేశారు. హుజురాబాద్–జమ్మికుంట ప్రాంత ప్రజలు ప్రత్యక్షంగా చూసినట్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి సరఫరా, రహదారులు, మున్సిపల్ అభివృద్ధి, మౌలిక వసతులు మరియు పేదల సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలయ్యాయని తెలిపారు.
రైతుబంధు, రైతు బీమా, కంటి వెలుగు, కేసీఆర్ కిట్, వృద్ధులు–వితంతువులు–వికలాంగులకు పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు పేద కుటుంబాలకు నిజమైన భరోసాగా నిలిచాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలుకాకుండా మిగిలిపోయాయని, ముఖ్యంగా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయని, ప్రజల అభివృద్ధి కన్నా రాజకీయ లబ్ధికే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించారు. హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల పరిధిలో డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యలకు బీఆర్ఎస్ పాలనలోనే శాశ్వత పరిష్కారాలు జరిగాయని, మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి కోట్లాది రూపాయలతో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించగలిగే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ గారి నాయకత్వంపై విశ్వాసం చాటాలని, రాష్ట్ర అభివృద్ధికి మరింత బలం అందించాలని ప్రజలను కోరారు. నిత్యం ప్రజల కోసం పని చేసే బీఆర్ఎస్ పార్టీకి మరోసారి పట్టం కట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చెర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వర్ రావు, జమ్మికుంట పట్టణ ఎన్నిక ఇంచార్జ్ జడ్పి మాజీ చెర్మన్ సుదీర్ కుమార్, హుజురాబాద్ పట్టణ ఎన్నికల ఇంచార్జ్ భూపతి రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *