క్లబ్ ఎన్నికల్లో రాజకీయ క్రీడ!
క్లబ్ ఎన్నికల్లో రాజకీయ క్రీడ!
– పార్టీల మధ్య ఆధిపత్య పోరుకు వేదికగా హుజురాబాద్ క్లబ్
– విందులు.. వ్యూహాలు.. క్యాంపు రాజకీయాలతో వేడెక్కిన పోరు
-రంగంలోకి దిగిన అధికార, ప్రతిపక్ష నేతలు.. ఏకగ్రీవానికి విఫలయత్నం
హుజురాబాద్ :
సాధారణంగా రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన ఎన్నికలు.. ఇప్పుడు రాజకీయ పార్టీల ఆధిపత్య పోరుకు వేదికగా మారాయి. పట్టుమని 333 మంది ఓటర్లు కూడా లేని హుజురాబాద్ క్లబ్ ఎన్నికలు నియోజకవర్గ రాజకీయాల్లో అనూహ్యంగా వేడి పుట్టిస్తున్నాయి. ఈ నెల 15న జరగనున్న ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు చేస్తున్న ప్రయత్నాలు ఒకవైపు ఉంటే.. తమ వర్గం ఆధిపత్యాన్ని చాటుకునేందుకు రాజకీయ నాయకులు తెరవెనుక పావులు కదుపుతున్నారనే ప్రచారం మరోవైపు ఆసక్తి రేపుతోంది. విందు రాజకీయాలు, మంతనాలు, వ్యూహప్రతివ్యూహాలు, క్యాంపు ఏర్పాట్లతో క్లబ్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి.
రాజకీయ నేతల జోక్యంతో మారిన సమీకరణాలు…
గతంలో హుజురాబాద్ క్లబ్ ఎన్నికలు పార్టీలకతీతంగా, ప్రముఖుల సమన్వయంతో ఏకగ్రీవంగా జరిగేవి. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. తొలుత సాధారణ ఎన్నికలుగానే కనిపించిన ఈ పోరు.. క్రమంగా రాజకీయ రంగు పులుముకుంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్, మంత్రి పొన్నం ప్రభాకర్‌ల ప్రమేయం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమకు అనుకూలమైన ప్యానల్ గెలిస్తే నియోజకవర్గంలో రాజకీయంగా పైచేయి సాధించినట్లవుతుందనే భావనతో ఇరు పార్టీల నాయకులు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఏకగ్రీవానికి విఫలయత్నం…
క్లబ్ ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు హుజురాబాద్‌కు చెందిన ప్రముఖ మిల్లర్ కల్లెపు మోహన్‌రావు ద్వారా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కౌన్సిలర్ వర్దినేని రవీందర్రావు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అయితే ఈ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు తమ గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. 333 మంది సభ్యులున్న క్లబ్లో రెడ్డి, రావు సామాజిక వర్గాలకు చెందిన సభ్యుల ఆధిపత్యం ఉండటంతో ఈ ఎన్నికల్లో వారి మద్దతు కీలకంగా మారింది.
సెక్రటరీ పదవిపైనే అందరి చూపు…
క్లబ్ నిర్వహణలో కీలకమైన కార్యదర్శి పదవికి కట్కూరి మల్లారెడ్డి, నారాయణరెడ్డి పోటీ పడుతున్నారు. ఇద్దరూ రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులు కావడంతో ఈ పోరు ఆసక్తికరంగా మారింది. ఉపాధ్యక్ష పదవికి ప్రముఖ న్యాయవాదులు విజయారెడ్డి, గౌరు సమ్మిరెడ్డి, నాగార్జున డెయిరీ యజమాని పుల్లూరి ప్రభాకర్‌రావు బరిలో ఉన్నారు. సంయుక్త కార్యదర్శి పదవులకు హరిప్రసాద్, శివనాదుని వేణు, మంద రమేష్ పోటీ చేస్తున్నారు. కోశాధికారి పదవికి గర్రెపెల్లి శ్రీను, కొండ గణేష్ తలపడుతున్నారు. కార్యవర్గ సభ్యుల స్థానాల కోసం 21 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాలుగా చీలిక!
ఈ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఒకవైపు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి సన్నిహితంగా ఉన్న వర్గం మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుండగా.. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్‌ల మద్దతు కోసం మరో వర్గం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. క్లబ్ వ్యవస్థాపకుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావును నారాయణరెడ్డి ప్యానల్ సభ్యులు కలవడం, అనంతరం కాంగ్రెస్ నేతలను సంప్రదించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ప్రత్యర్థి వర్గం కూడా తమ రాజకీయ మద్దతును కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
విందులు.. క్యాంపులు.. ఓటర్లకు గాలం!
క్లబ్ ఎన్నికల ప్రచారం ఇప్పుడు మరో స్థాయికి చేరింది. సాధారణ ఎన్నికల్లో కనిపించే హడావుడి, హంగామా క్లబ్ ఎన్నికల్లోనూ దర్శనమిస్తోంది. పోలింగ్‌కు పది రోజుల ముందే అభ్యర్థులు సభ్యులకు వరుసగా విందులు ఏర్పాటు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. కీలక సభ్యులను తమవైపు తిప్పుకునేందుకు వ్యక్తిగత మంతనాలు సాగుతున్నాయి. మెజారిటీ సభ్యులను ఒకచోట చేర్చి క్యాంపు రాజకీయాలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిన్న ఎన్నికే అయినా గెలుపు కోసం పెద్ద రాజకీయమే నడుస్తుండటం పట్టణంలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
క్లబ్‌కు రాజకీయాలకు అతీతమైన చరిత్ర…
హుజురాబాద్ క్లబ్‌ను మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి. లక్ష్మీకాంతారావు ప్రత్యేక శ్రద్ధతో అన్ని హంగులతో తీర్చిదిద్దారు. గత పదేళ్లుగా రాజకీయాలకు అతీతంగా వివిధ వర్గాల సభ్యులను సమన్వయం చేస్తూ క్లబ్‌ను ముందుకు నడిపించారు. క్లబ్ అభివృద్ధి, సభ్యుల మధ్య సఖ్యతే లక్ష్యంగా పనిచేశారు. ఈసారి కూడా గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎన్నికలు ఏకగ్రీవంగా లేదా సుహృద్భావ వాతావరణంలో జరగాలని ఆయన ఆకాంక్షించినట్లు తెలుస్తోంది. అయితే కొందరు సభ్యుల పట్టుదల, రాజకీయ సమీకరణాల ప్రభావంతో ఎన్నికలు పోటీ దిశగా మళ్లాయి.
చిన్న క్లబ్.. పెద్ద రాజకీయ పోరు!
వాస్తవానికి 333 మంది సభ్యుల ఓట్లతో నిర్ణయమయ్యే క్లబ్ ఎన్నికలు నియోజకవర్గ రాజకీయాలను ఏ మేరకు ప్రభావితం చేస్తాయన్నది ప్రశ్నార్థకమే. అయినప్పటికీ రాజకీయ నాయకులు ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించడం వెనుక తమ అనుచరుల బలాబలాలను పరీక్షించుకోవాలనే వ్యూహం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్లబ్లో ఎవరు గెలుస్తారన్నది ఒక అంశమైతే.. ఈ గెలుపు ద్వారా ఏ రాజకీయ వర్గం పైచేయి సాధిస్తుందన్నది ఇప్పుడు అసలు చర్చ. పార్టీలకు అతీతంగా సాగాల్సిన క్లబ్ ఎన్నికలు చివరకు రాజకీయ ప్రతిష్ఠకు వేదికగా మారడం హుజురాబాద్‌లో చర్చనీయాంశంగా మారింది.
